దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు సాయంత్రం సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సహా కేబినెట్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ గౌబా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడం, ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోదీ సృష్టిసారించనున్నారు.
భారీగా వ్యాప్తి..
దేశంలో కొత్తగా 552 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఈ మొత్తం కేసుల్లో 1,409 మంది ఒమిక్రాన్ బాధితులు రికవరయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, దిల్లీ (513), కర్ణాటక (441), రాజస్థాన్ (373), కేరళ (333), గుజరాత్ (204) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 224 రోజుల్లో ఇదే అత్యధికంగా. యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611కు చేరింది. గత 197 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది మే 29న దేశంలో 1,65,553 కరోనా కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 327 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4,83,790కి పెరిగింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.66 శాతానికి పెరిగింది. కరోనా రికవరీ రేటు 96.98 శాతానికి చేరింది.