Karimnagar Crime News | కరీంనగర్: సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న తండ్రే సుపారీ  మరీ సొంత కొడుకును హత్య చేయించడం కలకలం రేపింది. కరీంనగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అక్రమ సంబంధాలు పరువు తీయడమే కాదు, ఆత్మహత్యలతో పాటు హత్యలు చేసేందుకు దారితీస్తున్నాయి. రక్త సంబంధం ఉన్న వారిని సైతం నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Continues below advertisement

అసలేం జరిగిందంటే..

ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్  మీడియా సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అంజయ్య (36) అనే వ్యక్తి తన పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ల పాటు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన నాటి నుండి తన తండ్రి లచ్చయ్య, తన భార్య మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించి వారిద్దరినీ పలుమార్లు మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. అంజయ్య తన పరిస్థితిని  బంధువుల వద్ద చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడు.

Continues below advertisement

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..తమ వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన తండ్రి లచ్చయ్య, తన కోడలితో కలిసి అంజయ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. మొదట మంత్రగాడి వద్దకు వెళ్లి మందు పెట్టి చంపాలని అనుకున్నాడు. ఒకవేళ కొడుకు అనారోగ్యం పాలై మంచాన పడితే సేవ చేయాల్సి వస్తుందని భావించి వెనక్కితగ్గాడు. ఎలాగైనా హత్య చేయాలని నిశ్చయించుకొని కొలిపాక రవి అనే మధ్యవర్తిని ఆశ్రయించాడు. తన కొడుకు అంజయ్యను హతమార్చేందుకు ఉప్పరపల్లి కోటేశ్వర్, మహ్మద్ అబ్రార్‌లతో రూ.3 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా లచ్చయ్య 1.25 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా, నిందితులు ప్లాన్ ప్రకారం అంజయ్యతో పరిచయం పెంచుకుని స్నేహం చేసినట్లు నటించారు. నెల రోజులుగా వీరంతా కలిసి రోజూ మద్యం సేవించేవారు.

ఈ నెల 2వ తేదీన నిందితులు ప్లాన్ ప్రకారం అంజయ్యను గ్రామ శివారులోని కెనాల్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. మత్తులో ఉన్నఅంజయ్యను గొంతు నులిమి హత్య చేసి, డెడ్‌బాడీని కాలువలో పడేశారు. అంజయ్య కనిపించడం లేదంటూ తండ్రి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 5న కాలువలో అంజయ్ మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువ పడ్డాడని అంతా భావించారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. 

డబ్బు కోసం వచ్చి దొరికిన సుపారీ గ్యాంగ్

ఈ క్రమంలో సుపారీ నగదు కోసం నిందితులు అంజయ్య తండ్రి లచ్చయ్య ఇంటికి వచ్చారు. వారిపై అనుమానం రావడంతో, అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని తండ్రి లచ్చయ్య, అంజయ్య భార్య ఈ హత్యకు ప్లాన్ చేశారని తేలింది. వీరిద్దరితో పాటు సుపారీ తీసుకుని అంజయ్యను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.