Karimnagar Brother in Law Murder: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి కోసం సొంత బావ తన బావమరిదిని హత్య చేశాడు. అయితే తాను అధికార పార్టీ కార్పొరేటర్ కు భర్త కావడమే అతను అంతటి ఘోరానికి తెగించేలా చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బావమరిది భూములు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయలను అక్రమంగా చేజిక్కించుకోవాలని వేసిన మాస్టర్ ప్లాన్ ఈ హత్యకు దారి తీసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు కు చెందిన కొమ్ము రవీందర్ ఈ నెల రెండో తారీఖున శివారులో గల కెనాల్లో శవమై కనిపించాడు. అతని బైక్ కెనాల్ రోడ్డు పై పడి ఉండడంతో చాలామంది యాక్సిడెంట్ కారణంగా అతను అక్కడి ఫెన్సింగ్ గోడని గుద్దుకొని అందులో పడి ఉంటాడని భావించారు. అయితే మృతుడి తండ్రి మాత్రం మొదటనుండి తన కూతురు అల్లుడు పైనే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మృతుడి తండ్రి వెంకటయ్య పోలీసులను ఆశ్రయించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేయాలని కోరగా పోలీసులు అలాగే చేశారు.
పోలీసులు తమ దర్యాప్తులో విన్న సమాచారం ప్రకారం వారి ప్రధాన అనుమానితుడు అధికార పార్టీ కార్పొరేటర్ భర్త అయిన శ్రీనివాస్ యాదవ్ రామగుండం కార్పోరేషన్ లో కీలకమైన పదవిలో ఉన్న అధికార పార్టీ నేత. ఇక తమ వంతు విచారణ చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధమైన పోలీసులు అందరి మొబైల్ డాటా, ఇతర టెక్నికల్ డేటా సేకరించారు. మృతుడు ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడో వాటికి సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సైతం తెప్పించుకొని విశ్లేషణ ప్రారంభించారు. ఈ సమయంలోనే వారికీ వచ్చిన అనుమానం నిజమైంది.
అసలేం జరిగింది?
మృతుడి బావ అయిన శ్రీనివాస్ యాదవ్ రామగుండంలోని కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కి సంబంధించిన నేత. అంతేకాకుండా తన భార్యని కార్పొరేషన్లో కార్పొరేటర్ గా కూడా గెలిపించుకున్నాడు. అయితే ఈ మధ్య బావమరిది అయిన రవీందర్ కి భూములు అమ్మగా వచ్చిన డబ్బు కోట్లల్లో ఉండటం గమనించాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అయిన బావమరిదిని కనుక ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా లేపేస్తే ఆస్తి మొత్తం తన వశం అవుతుందని కుట్రకు తెర లేపాడు. దీంతో పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి వివరాలు సేకరించి సూపారి గ్యాంగ్ ను మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది.
యాక్సిడెంట్ కారణంగా ఒక వేళ రవీందర్ చనిపోతే అతని ఆస్తి ఆటోమేటిక్ గా తన వశం అవుతుందని శ్రీనివాస్ యాదవ్ భావించి మర్డర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు? అనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఆస్తి కోసం సొంత శ్రీనివాస్ యాదవ్ వైఖరిపట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.