Kanjhawala Accident:


2020లో ఆగ్రాలో అరెస్ట్..


కంజావాలా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంజలి సింగ్ ఫ్రెండ్ నిధి గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ యువతి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో Narcotic Drugs and Psychotropic Substances Act కింద నిధిని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నట్టు ANI వార్తా సంస్థ తెలిపింది. తెలంగాణ నుంచి ఆగ్రాకు గంజాయి తీసుకొ స్తుండగా ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేసి అరెస్ట్ చేశారు. అదే కేసులో సమీర్, రవి అనే యువకులనూ అరెస్ట్ చేశారు పోలీసులు. నిధి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2020 డిసెంబర్ 15న ఆమెకు బెయిల్ వచ్చినట్టు రిపోర్ట్‌లు చెబుతు న్నాయి. అయితే...కంజావాలా కేసులో భాగంగా ఆమెను విచారిస్తున్న సమయంలో ఈ పాత కేసు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈమెను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. విచారణకు మాత్రమే తనను పిలిచనట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే నిధి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


కొత్త ఫుటేజ్‌లు..


అయితే..కంజావాలా కేసులో మరో రెండు సీసీటీవీ ఫుటేజ్‌లు కొత్త అనుమానాలకు తెర తీశాయి. అంజలి, నిధితో పాటు స్కూటీపై ఓ యువకుడు కూడా ఉన్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అంజలి, నిధితో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారిస్తున్నారు. వీటిలో మొదటి ఫుటేజ్‌ 7.7 నిముషాల నిడివి ఉంది. ఇది డిసెంబర్ 31 అర్ధరాత్రి వీడియో. అందులో స్కూటీపై అంజలి నిధి ఉన్నారు. ఓ యువకుడు స్కూటీ నడుపుతున్నాడు. మధ్యలో అంజలి కూర్చోగా... చివర నిధి కూర్చుంది. ఓ వీధి వద్ద స్కూటీని ఆపారు. వెంటనే నిధి కిందకు దిగి అంజలికి ఏదో ఇచ్చింది. తరవాత లోపలకు వెళ్లి పోయింది. అంజలి, ఆ యువకుడు మాత్రం అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి అంజలి అదే వీధిలోకి తొందరగా వెళ్లిపోయింది. ఆ తరవాత యువకుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంజలి ఇంటి వద్ద ఉన్న కెమెరాలోనే ఇదంతా  రికార్డ్ అయిందని పోలీసులు తెలిపారు. 


మూడు నిముషాల్లో..


ఓ మూడు నిముషాల తరవాత అంజలి బయటకు వచ్చింది. ఆ తరవాత ఆమె వెనక నిధి వచ్చింది. అప్పటికే ఓ చోట స్కూటీ పార్క్ చేసి ఉంది. మళ్లీ యువకుడు కనిపించ లేదు. అంజలి స్కూటీ నడుపుతుండగా...నిధి వెనకాల కూర్చుంది. మూడు నిముషాల తరవాత ఇదే వీధిలో అంజలి మృతదేహాన్ని కింద పడేసి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మూడే మూడు నిముషాల్లోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎవరు..? అని ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే...ఆ వ్యక్తి అంజలి ఫ్రెండ్ నవీన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ యువకుడిని పోలీసులి విచారించారనీ సమాచారం. కానీ...ఆ మూడు నిముషాల్లోనే ఏం జరిగి ఉంటుందన్నది తేలాల్సి ఉంది. 


Also Read: Joshimath Sinking: ఉన్నట్టుండి బీటలు వారిన ఇళ్లు, రోడ్లు - ఉత్తరాఖండ్‌లో టెన్షన్