Joshimath Sinking:


జోషిమఠ్‌లో ఆందోళన..
 
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి రోడ్లపై పగుళ్లు వచ్చాయి. సింగ్‌ధార్ వార్డులోని ఓ శివాలయం కుప్ప కూలింది. ఇళ్ల గోడలకూ పగుళ్లు వచ్చాయి. ఫలితంగా..స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందోనని భయపడిపోతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా...ప్రజలు మాత్రం ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. 
ఈ క్రమంలోనే...ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నారు. వైద్య సేవలనూ అందుబాటులో ఉంచనున్నారు. అసలు అకస్మాత్తుగా ఇక్కడి భూమి కుంగిపోవడానికి కారణాలేంటో పరిశీలించాలని కేంద్రం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి స్పందించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులకు ఆదేశించారు. జోషిమఠ్‌ను సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్-మలారీ రోడ్‌ కుంగిపోవడం సంచలనమైంది. భారత్, చైనా సరిహద్దుని అనుసంధానం చేసే ఈ మార్గం వ్యూహాత్మకమైంది. అందుకే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. "ప్రజల ప్రాణాలను కాపాడడం మా విధి. 600 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఎందుకిలా జరిగిందో ఆరా తీస్తున్నాం. పరిష్కారమూ ఆలోచిస్తున్నాం" అని సీఎం ధమి వెల్లడించారు. ఇప్పటికే సీఎం నేతృత్వంలో ఉన్నతాధికారులతో ఓ సమావేశం జరిగింది. ఇప్పటికే 50 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌ సెసెమిక్ జోన్‌ Vలో ఉంది. భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలున్న ప్రాంతాన్ని ఈ జోన్‌గా పరిగణిస్తారు. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణమని ప్రాథమికంగా తేలింది.