Kamareddy Crime News :   సినిమాల్లో చూశాడో ..  యూట్యూబ్ చానల్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడో కానీ  ఇప్పుడిప్పుడే కుర్రాడిగా మారిన శంకర్‌కు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలనిపించింది. ఏం చేయాలా అని ఆలోచించి.. చివరికి తన సినిమాల నాలెడ్జే ప్రయోగించారు. రోడ్డు మీద వెళ్లే ఓ అమ్మాయిని ఎంచుకుని వెంటపడటం ప్రారంభించాడు.  ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదని అనుకున్నాడేమో కానీ... చివరికి మాత్రం తేడా కొట్టేసింది. కొట్టడం అంటే.. ఆషామాషీగా కాదు చెప్పుతోనే కొట్టేసింది.  తాను వెంట పడుతున్న యువతి రివర్స్ అయితే చెప్పులతో చెడామడా వాయించేసిన తర్వాతే.. తన ప్రయత్నం రివర్స్ అయిందని తెలుసుకుని లెంపలేసుకున్నాడు. కానీ అప్పటికే  పరువు పోయింది.. కేసు కూడా అయి జైలు పాలయ్యాడు. 


కామారెడ్డి చెందిన శంకర్ .. చదువు అబ్బలేదు. చిల్లరగా తిరిగేవాడు. ఇటీవల వీక్లీ బజార్‌లో నిలబడి ఓ యువతికి బీట్ వేయడం ప్రారంభించాడు. ఓ యువతిని ఎంచుకుని.. ఆమెను ఫాలో అవడం ప్రారంభించాడు. ఆమె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో.. అప్పట్నుంచి ఆమె వెంటపడేవాడు. మళ్లీ ఇంటికి వెళ్లే వరకూ ఈ టార్చర్ ఆమెకు ఉండేది. మధ్యలో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు. మాట్లాడుకుందామని ఫోన్ నెంబర్ కావాలని అడిగేవాడు. చాలా రోజుల పాటు పట్టించుకోలేదు. కానీ వదిలి పెట్టలేదు. చివరికి తాను ప్రేమిస్తున్నానని కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. దీంతో ఆమె ఇక భరించలేకపోయింది. సహనం కోల్పోయింది. అంతే..  ఆ తర్వాత ఏం  జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


మంగళవారం ఆమె ఇంటి నుంచి  బయలుదేరి వీక్లీ బజార్‌కు వచ్చిన సమయంలోనూ శంకర్ వెంటబడ్డారు. ప్రేమిస్తున్నానని...ఫోన్ నెంబర్ ఇవ్వాలని.. మరోసారి వేధించాడు..అప్పటికే  పూర్తి స్థాయిలో చిరాకుతో ఉన్న ఆమె.. ఒక్క సారిగా శంకర్ చొక్కా పట్టుకుంది. ఎడమ కాలు చెప్పు తీసి.. టపటపా బాదేసింది. శంకర్‌కు ఎం జరిగిందో తెలిసే లోపు.. చెంపల మీద చెప్పు దెబ్బలు పడ్డాయి. ఈ లోపు చుట్టుపక్కల వారు వచ్చారు. ఇక వారికి కూడా జరిగింది చెప్పి... వారు పట్టుకోవడంతో పైన మరోసారి నాలుగు బాదింది. దీంతో ఆ ఆకతాయి ఒళ్లంతా చెప్పు దెబ్బలు తప్పలేదు. చాలా సేపు అలా తన్నిన తర్వాత పోలీసులు వచ్చారు. ఆమె బారి నుంచి కాపాడి స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేశారు. 


నెల రోజులుగా అదే పనిగా వేధిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పోకిరీలకు ... చెప్పుతో బుద్ది చెప్పకపోతే.. మరింత ముందుకెళ్తారని.. మహిళల అసహాయతను ఆసరాగా చేసుకుని దారుణాలకు పాల్పడతారన్న అభిప్రాయం..  ఆ యువకుడ్ని కొట్టిన తర్వాత స్థానిక జనం వ్యక్తం చేశారు. సినిామ స్టైల్లో లవర్‌ను సంపాదించుకుందామనుకున్నాడో లేకపోతే.. జులాయిగా తిరుగుతూ.. ఇలాంటి  తుంటరి పనులు చేసి.. ఆనందం పొందుదామనుకున్నాడో కానీ.. చివరికి శంకర్ చెప్పు దెబ్బలు తిని జైలు పాలు కావాల్సి వచ్చింది.