అప్పుడు కియా ఇప్పుడు జాకీ. ఏపీలో పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారా? లేదంటే ప్రభుత్వం, అధికారపార్టీ నేతల తీరు వల్లే పరిశ్రమలు ఆంధ్రాని విడిచివెళ్తున్నాయా? ఇప్పుడిదే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అధికార విపక్షాలకు ఉంది.
తెలుగురాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదనేది కొందరి వాదన. 2014లో కొత్త రాష్ట్రానికి తొలి సిఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏవీ రాకపోగా ఆనాడు చంద్రబాబు తెచ్చిన ఒకటి రెండు పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి లోదుస్తుల కంపెనీ జాకీ అనంతపురం జిల్లా నుంచి తెలంగాణకి తరలిపోవడంతో వార్తల్లోకి వచ్చింది.
రాప్తాడు ఎమ్మెల్యే ఆయన అనుచరులు లంచం డిమాండ్ చేయడం వల్లే చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీ తెలంగాణకి వెళ్లిపోయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇలాంటివి జగన్ ప్రభుత్వంపై రావడం ఇది కొత్తకాదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో ఇలానే కియా కార్ల కంపెనీ తరలిపోతోందని వార్తలు హడావుడి చేశాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పెద్ద పెద్ద కంపెనీలను ఏపీకి తీసుకువస్తుంటే జగన్ అండ్ టీమ్ తరలిపోయేలా చేస్తోందని అప్పట్లోనే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకరువు పెట్టాయి. ఈ ఇష్యూ పెద్ద వివాదం కావడంతో కియా కంపెనీ స్పందించింది. అలాంటిదేమీ లేదని ఈ వార్తలు నిజం కాదని చెప్పింది. అయినా కానీ దుమారం సద్దుమణగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. కియా కార్ల కంపెనీకి ఏపీలో అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెబుతూ అందుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. అంతేకాదు కియా కార్ల కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేలా చేసి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టగలిగింది.
మళ్లీ ఇప్పుడు సేమ్ సీన్ జాకీ కంపెనీ విషయంలోనూ జరుగుతోంది. నిజంగా జాకీ కంపెనీ ఏపీ నుంచి తెలంగాణకి వెళ్లిపోయిందా లేదంటే తెలంగాణలో కూడా కంపెనీని విస్తరించే పనిలో ఉందా ? అన్నది ప్రధాన ప్రశ్న. ఇంకొకటి ఇలా పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్న వార్తల్లో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది? ప్రతిపక్షాల కుట్ర వల్ల వెళ్లిపోతున్నాయా లేదంటే నిజంగానే ప్రభుత్వ విధానాలు నచ్చక కంపెనీలు వెళ్లిపోతున్నాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కన్నా కంపెనీలను రాకుండా అడ్డుకోవడంలోనే రాజకీయపార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్న విమర్శలైతే సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
రాజకీయ విమర్శలు చేసుకోవడమే తప్ప.. కొత్తగా వచ్చే పరిశ్రమలకు కావాలసిన వాతావరణం, సౌకర్యాలు ఏపీలో ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. ఆంధ్రాకి పరిశ్రమలు రావడానికి అధికార ప్రతిపక్షాలు కలసి కట్టుగా పనిచేయాలని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో కూడా రాజకీయాలేనా? అనేది అంతా అనుకుంటున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని కానీ ఐదేళ్లే రాజకీయాలు చేస్తున్నాయి ఏపీలో పొలిటికల్ పార్టీలు. అందరూ కలసి ఆంధ్రప్రజల అభివృద్ధికి అడ్డంకి మారారనేది వారు గుర్తించాల్సిన అంశమని ప్రజలు అనుకుంటున్నారు.