Kamareddy Bus Accident : కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డిలో  ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.  


అసలేం జరిగింది? 


కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ శనివారం హైదరాబాద్‌  బయలుదేరింది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ సమీపంలోకి రాగానే పాత జాతీయ రహదారిపై బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ ఎక్కి బోల్తా పడింది. రోడ్డుపై బస్సు బోల్తా కొట్టడాన్ని గమనించిన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను రక్షించారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో కలిసి మొత్తం 29 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో కొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.  వారిని హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 


కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం


కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. అందులో వరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.


అసలేం జరిగింది? 


అత్తిలిలో ఓ వివాహం ఘనంగా జరిగింది. పెద్దల సమక్షంలో వారి ఆశీర్వాదంతో ఓ యువతి, యువకుడు పెళ్లిపీటలు ఎక్కారు. అత్తిలిలో వివాహం చేసుకొని వధూవరులు మరికొందరు బంధువులతో వరుడు నివాసానికి హైదరాబాదుకు బయలుదేరారు. వివాహ వేడుక జరగడంతో రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. కానీ బంధువులతో కలిసి వధూవరులు ప్రయాణిస్తున్న కారు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ న్ ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వధూవరులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది (Car Damaged In Road Accident) . ఈ ఘటనలో పెళ్లి బృందం కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. 


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి ఐదుగురిని తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిని గాయత్రి (26), రేణుక(23), శివ శంకర్ (25), సీతారావమ్మ(47), శరత్(27) లుగా గుర్తించారు. అత్తిలిలో వధువు ఇంటి వద్ద వివాహం చేసుకొని హైదరాబాదు వెళుతుండగా ఘటన జరిగినట్లు స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. రాత్రి వివాహం జరగగా, హైదరాబాద్‌లోని వరుడి నివాసానికి కారులో బయలుదేరగా మార్గం మధ్యలో కారు కల్వర్టును ఢీకొట్టడంతో రెండు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కార్ డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వరుడు శివశంకర్, వధువు రేణుక, వరుడి తల్లి సీతారావమ్మ, గాయత్రి, మరొకరు గాయపడ్డారు. వారిలో వరుడు కె శివశంకర్ పరిస్థితి విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డ ప్రమాదం విషయంలో ఏ నిర్లక్ష్యం కనిపించడం లేదు. వాహనం నడుపుతున్న కారు డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని మిగతా వారు గమనించేలోగా వాహనం డివైడర్ ను వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగేలా కనిపిస్తోంది.  


Also Read : Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?