Kallakurichi Illicit Liquor: తమిళనాడు రాష్ట్రంలో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 13కు చేరుకుంది. ఇంకా  పలువురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారు కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం 18 మందిని పుదుచ్చేరిలోని జిప్‌మార్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  


సీఎం స్టాలిన్ సంతాపం
తమిళనాడులోని కళ్లకురిచ్చిలో మద్యం సేవించి చనిపోయిన 13మందికి సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు.  ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ జత్వాత్‌ బదిలీ అయ్యారు. కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్‌ ప్రశాంత్‌ నియమితులయ్యారు. కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త పోలీసు సూపరింటెండెంట్‌గా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. పలువురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందని, పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, మరో మంత్రి ఎ.వావేలులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం  సీబీసీఐడీకి అప్పగించాలని అధికారులకు ఆయన సూచించారు.


యథేచ్చగా కల్తీ మద్యం, డ్రగ్స్ విక్రయాలు
కల్తీ మద్యం, డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని కళ్లకురిచ్చి జిల్లా అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంథిల్‌కుమార్ సంచలన ఆరోపించారు. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో వరుసగా అనారోగ్య కారణాలతో పలువురు మరణించారు. వీరంతా కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు సమాచారం. అయితే కల్తీ మద్యం వల్లే వీరు చనిపోయారని తమిళనాడు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రశ్నించగా మద్యం తాగి అడ్మిట్ అయ్యామని చెబుతున్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల వాంతులు, మూర్ఛ, విరేచనాలు వంటి సమస్యలు వచ్చాయి. కొత్తమేడు కళ్లకురిచ్చి బస్ స్టేషన్ పక్కన ఉంది.  సమీపంలోని ఆస్పత్రిలో 48 మంది చికిత్స పొందుతుండగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల నుంచి మద్యం సేవించామని బాధితులు చెబుతుంటే.. కల్తీ మద్యం లేదని జిల్లా కలెక్టర్ తోసిపుచ్చారు. కాగా మిథనాల్ పాయిజనింగ్ కారణంగా ప్రభావితమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ అధికారి తెలిపారు.


మెరుగైన చికిత్స కోసం తరలింపు
కళ్లకురిచ్చి ప్రభుత్వాసుపత్రిలో  మెరుగైన వైద్య సౌకర్యాలు లేవు. అడ్మిట్ అయిన నలుగురు మహిళల్లో ఒకరు మృతి చెందారు. మాధవచేరి గ్రామంలో మంగళవారం మరొకరు చనిపోయారు. ఆర్నెళ్ల నెలల క్రితం విల్లుపురం జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారికి డీఎంకే ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. కళ్లకురిచ్చి జిల్లాలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 


ప్రభుత్వం పై విమర్శలు
మరోవైపు కల్తీ మద్యం ఘటనపై బీజేపీ  నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నమలై డిమాండ్ చేశారు. గత ఏడాది చెంగలపట్టు జిల్లాలో కూడా 23 మంది కల్తీసారా తాగి మృతిచెందారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్తీమద్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.