Kakinada News: కాకినాడ జిల్లా పిఠాపురంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. అప్పటి వరకు హాయిగా డ్యాన్సులు, భజనలు చేస్తూ వచ్చి.. స్వామిని సముద్రంలో వదలబోయారు. కానీ అనుకోని విధంగా విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలు ఒకరి ప్రాణాలను బలి తీసుకోగా.. మరో నలుగురిని వెంట తెసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు, మత్స్యకారులు ఇద్దరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మృతుడు అన్నిశేట్టి వెంకటేష్ రెడ్డి నాగులపల్లికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన వాళ్లు కూడా అదే గ్రామానికి చెందిన వారని.. స్థానికులు చెబుతున్నారు.
జిల్లాలో మరోచోట అపశ్రుతి.. ఇద్దరు గల్లంతు!
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నవఖండ్రవాడ గోదావరి కాలువలో వినాయక నిమజ్జనం చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. పిఠాపురం సాలిపేటకు చెందిన దూసూరి నరసింహాచార్యులు (38), జోకా కుమార స్వామి (34)లు గోదావరి కాలువలో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మత్స్యకారులతో పాటు సహాయక బృందాలను కూడా రంగంలోకి దించి చర్యలు చేపడుతున్నారు.
నిన్నటికి నిన్న తెలంగాణలో డ్యాన్స్ చేస్తూనే...
గణేష్ నిమజ్జనోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఓ యువకుడు అప్పటివరకు అందరితో కలిసి తెగ డ్యాన్స్ చేశాడు. ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు, స్నేహితులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలపడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
గణేష్ నిమజ్జనం వేడుకల్లో విషాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటు చేసుకోంది. స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ మండపం వద్ద తిరుమలేష్ (18) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని హూటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమజ్జనం సమయంలో యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఇలా ఆకస్మికంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు అప్పటి వరకు తమతో కలిసి డ్యాన్స్ చేసిన స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడాన్ని స్నేహితులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద వార్త గ్రామస్థులందరినీ అందరిని కలచి వేసింది.
మొన్నటికి మొన్న స్టేజీపైనే డ్యాన్స్ చేస్తూ..
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. స్టేజీపై నృత్యం చేస్తోన్న ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది..
జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతి క కార్యక్రమంలో యోగేశ్ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. కాసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు కారణంగా యోగేశ్ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.