Kakinada Crime : వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తున్నాయి. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని భావిస్తే ఎవరినైనా అడ్డుతొలగించుకునేందుకు వెనకాడడం లేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియురాలి భర్తను అంతమొందించాడు ఓ వ్యక్తి. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈనెల 18వ తేదీన కాకినాడ జిల్లా  జగ్గంపేట మండలం మల్లీశాల గ్రామ శివారులో అర్ధరాత్రి జరిగిన హత్య కేసును జగ్గంపేట పోలీసులు ఛేదించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ వెల్లడించారు. జగ్గంపేట మండలం మల్లీశాల గ్రామానికి చెందిన బొల్లం శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు హత్య చేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు  కేసును ఛేదించారు. 


వివాహేతర సంబంధమే కారణం 


మృతుడు బొల్లం శివప్రసాద్ భార్య లోవదుర్గకు పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన అంగటి అప్పలరాజు అనే వ్యక్తికి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అంగటి అప్పలరాజును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. హత్య కేసులో నిందితుడు అప్పలరాజు శివప్రసాద్ కరెంట్ షాక్ తో హత్య చేసేందుకు కొన్ని రోజుల కింద ప్లాన్ వేశాడు.  అయితే అప్పుడు ఆ ప్లాన్ ఫలించలేదు. ఈసారి పగడ్బందీగా మరోసారి శివప్రసాద్ ను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. అది వర్కౌట్ అవుతుందో లేదో అని భావించిన అప్పలరాజు ఏది ఏమైనా తన ప్రియురాలు భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో కత్తితో మర్డర్ కు స్కెచ్ వేశాడు. సీక్రెట్ గా ఇంట్లోకి ప్రవేశించిన అప్పలరాజు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ప్రియురాలి భర్త శివను చాకుతో అత్యంత దారుణంగా హతమార్చాడు. 


అడ్డు తొలగించుకోవాలనే 


మృతుడు స్థానికంగా ఐషర్ వ్యాన్ ను కిరాయికి నడుపుతుంటాడు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో ఐషర్ వ్యాన్ ను అమ్మి హైదరాబాదుకు మకాం మార్చాలని భావించాడు. దీంతో మృతుని భార్య ప్రియుడు అప్పలరాజుకు ఫోన్లో తన భర్త ఐషర్ వ్యాను అమ్మేశాడని, ఇక మేము హైదరాబాద్ వెళ్లిపోతామని అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు అని చెప్పడంతో లోవదుర్గ తనకు దూరమవుతుందని రగిలిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న భర్త శివను చాకుతో అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మోటారు సైకిల్ని సీజ్ చేసి  నిందితుడిని కోర్టులో హాజరు పరచామని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో శివప్రసాద్ భార్య పాత్రపై విచారణ జరుగుతుందన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన జగ్గంపేట సీఐ బి. సూర్య అప్పారావు, ఎస్సై రఘునాథరావు, క్రైమ్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


Also Read : Ankita Bhandari Murder Case: యువతి హత్య కేసులో భాజపా లీడర్‌ కొడుకు అరెస్ట్, చంపి కాలువలో పడేసిన నిందితులు


Also Read :   Haryana Crime News: గదిలో 36 రోజులపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం, డబ్బు కడితే కానీ వదలని కీచకులు