Credit Card Cyber Crime : మీ క్రెడిట్‌ కార్డు ట్రాక్‌ చాలా బాగుంది. క్రెడిట్‌ లిమిట్ ఇంకా పెంచాలనుకుంటున్నాం. మీ డీటైల్స్‌ ఒక సారి చెక్‌చేసుకోండి అంటూ ఓ ఫోన్‌ వస్తుంది. మన వివరాలన్నీ మనం చెప్పకుండానే పేరు, బ్యాంకు, క్రెడిట్‌ కార్డు ద్వారా చేసిన ట్రాన్జక్షన్స్‌ వివరాలు అన్నీ అనర్గళంగా చెబుతారు. ఆఖరికి ఈనెలలో మీరు వినియోగించిన క్రెడిట్‌ను నిర్ణీత సమయంలో రికవరీ చెల్లించాలని సూచించి మీ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్యూ అంటూ ముగిస్తారు. మళ్లీ మరుసటిరోజు లేక మరో రెండు రోజులు గడిచాక మళ్లీ ట్రూకాలర్‌లో బ్యాంక్‌ నుంచి వచ్చినట్లు మరో కాల్‌ వస్తుంది. మీరు చెల్లించాల్సిన క్రెడిట్‌ కార్డు రికవరీ వీలైనంత త్వరగా చెల్లించేయండి. ఎందుకుంటే మీకు ఈనెల నుంచి క్రెడిట్‌ లిమిట్ పెరగబోతుందని బిల్డప్‌ ఇస్తారు. 


క్రెడిట్ కార్డు అమౌంట్ రేంజ్ పేరిట మోసం 


ఒక వేళ మీరు అప్పటికీ క్రెడిట్‌ కార్డు రికవరీ చెల్లించకపోతే త్వరగా చెల్లించాలని, లేకపోతే సిబిల్‌ స్కోర్‌ తగ్గి క్రెడిట్‌ కార్డు రేంజ్‌ పెరగదని హెచ్చరిస్తారు సైబర్ కేటుగాళ్లు. ఒక వేళ రికవరీ చెల్లించినట్లయితే మీరు సకాలంలో రికవరీ చెల్లించినందుకు ధన్యవాదాలు చెపుతూ ప్రారంభిస్తారు. మీ క్రిడిట్‌ కార్డు రేంజ్‌ అదనంగా మరో 50 వేల రూపాయలు యాడ్‌ అవుతుందని, దానికి కొన్ని డీటెయిల్స్‌ చెప్పాలని సూచిస్తారు. ఇంతకీ గత నాలుగు రోజులుగా మనల్ని ఫాలోఅప్‌ చేస్తున్న వ్యక్తి అవ్వడంతో మనం వెంటనే నమ్మి అడిగిన అన్ని ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతాం. చివరిగా మీ కార్డులో అమౌంట్‌ ఇంక్రీజ్‌ అయ్యేందుకు మీ మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ఆందులో నెంబర్‌ చెప్పాలంటూ సూచిస్తారు. అప్పటికే అన్ని వివరాలు చెబుతూ వచ్చిన మనం వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న నెంబర్‌ను చెబుతాం. అంతలోనే మన మొబైల్‌కు మరో మెసేజ్‌ వస్తుంది. ఇంకేముంది మన క్రెడిట్‌ కార్డులో ఉన్న 50 వేలు కట్ అయినట్లు. అంతలోనే మనతో అప్పటి వరకు చాలా హుందాగా మాట్లాడిన వ్యక్తి కూడా కాల్‌ కట్‌ చేస్తాడు. తిరిగి చేద్దామంటే ఆ కాల్‌ కనెక్ట్‌ అవ్వదు. లబోదిబో మనడం తప్ప మనం చేసేదేం ఉండదు. ఇలా కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 


సైబర్ నేరగాళ్ల నయా మోసం 


ఇప్పుడు క్రెడిట్‌ కార్డుల ద్వారా సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న నయా మోసం ఇది. మనకు క్రెడిట్‌ కార్డు ఉందన్న సంగతి ఇంట్లో వాళ్లకే తెలియదు కానీ ఈ సైబర్‌ నేరగాళ్లకు మాత్రం క్రెడిట్‌ కార్డు వివరాలు, మన అడ్రస్‌, ఆధార్‌ నెంబర్‌తో సహా తెలుస్తుంది. వారికి కావాల్సిందల్లా మన మొబైల్‌తో లింక్‌ అవ్వడం వల్ల అయిదంకెల ఓటీపీ మాత్రమే. సైబర్‌ కేటుగాళ్లు వేసిన వలలో మనం పడి ఓటీపీ చెప్పామంటే ఒక్క క్షణంలో మన క్రెడిట్‌ కార్డు నుంచి నగదు కట్ అవుతుంది. కొన్ని రోజులుగా ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాకినాడకు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తి ఈ తరహాలోనే మోసపోయాడు. వారం రోజులుగా తనను ఫాలో అప్‌ చేస్తుండడంతో సైబర్‌ నేరగాడి వలలో ఈజీగా పడిపోయాడు.  వారం రోజులుగా తనను ఫాలోఅప్‌ చేస్తున్న వ్యక్తే కదా అని సైబర్‌ నేరగాడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అదే మాయలో పడి ఓటీపీ చెప్పాడు. లబోదిబో అంటూ కాకినాడ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు వచ్చిన ఫోన్‌ కాల్‌ నెట్‌ ఆధారంగా వచ్చిందని, అదే ఐపీ నెంబరుపై హైదరాబాద్‌లో మరికొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితుని క్రెడిట్‌ కార్డు ద్వారా సైబర్‌ నేరగాడు వేరే రాష్ట్రంలో బంగారం కొనుగోలు చేసినట్లు కొంత వరకు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఈ తరహా కేసులు అంత త్వరగా తేలే పరిస్థితి ఉండదని పోలీసులు చెబుతున్నారు. 


అపరచిత ఫోన్‌కాల్స్‌పై జాగ్రత్త 


అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్లు చేసి వివరాలు అడిగితే చెప్పవద్దని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల ద్వారా ఈ తరహా మోసాలు ఎక్కువవుతుండడంతో కేవలం బ్యాంకుల ద్వారా వచ్చే కాల్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్పందించాలని, ఇలాంటి కాల్స్‌ను అటెమ్ట్‌ చేయకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఆపరేట్‌ చేస్తున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. నెట్‌ ఆధారంగా ఫోన్‌ కాల్స్‌చేస్తారని, అటువంటి కాల్స్‌ను వినియోదారులు అవైడ్‌ చేయాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల మన డీటెయిల్స్‌ అన్నీ చాలా సునాయాసంగా చెప్పగలరని, అయినా మనం ఏమాత్రం వారి మాయలో పడకుండా మొబైల్‌కు వచ్చే మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం కానీ అందులో సమాచారాన్ని చెప్పడం కానీ చేయకుండా అప్రమత్తంగా సూచించారు.