Hyderabad Man Kills 5 Stray Puppies: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఐదు కుక్కపిల్లలను గోడకేసి కొట్టి చంపడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిస్ అపార్టుమెంట్ లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్తాడు. ఆ ఆపార్టుమెంట్ దగ్గర.. ఓ వీధి కుక్క ఉండేది. ఆ కుక్క ఇటీవల పిల్లలను కన్నది. వీరు బయటకు వెళ్లినప్పుడు ఆ కుక్కపిల్లలు తోక ఊపుకుంటూ వచ్చేవి. నిన్న అలా వచ్చినప్పుడు ఆశీష్ కుక్క పిల్లను తీసుకుని గోడకేసి బలంగా కొట్టాడు. అతి రక్తం కక్కుకుని కింద పడిపోతే.. బతికిందో చనిపోయిందో గట్టిగా కొట్టి చూశాడు. ఇలా మొత్తం ఐదు కుక్కపిల్లలను చంపేశాడు.
ఆ కుక్కపిల్లల ప్రాణం కూడా తాను పెంచుకుంటున్న కుక్క ప్రాణం లాంటిదేనని అతను గుర్తించలేకపోయాడు. ఖాన్ అనే వ్యక్తి ఈ ఘోరాన్ని వీడియో తీసి బయట ప్రపంచానికి తెలిసేలా చేశాడు. జంతువులపై ఇంత క్రూరత్వం చూపించిన వ్యక్తిని సరైన విధంగా శిక్షించాలని కోరాడు. కుక్క పిల్లలను చంపడంపై స్థానికులు ఆశీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాను వాటిని తన కుక్క దగ్గరికి రాకుండా ఆపడానికి ప్రయత్నించానని చంపలేదని వాదించాడు. కానీ CCTV ఫుటేజ్‌లో దొరికిపోయాడు. రోజుల వయసున్న కుక్కపిల్లలు ఏమి చేస్తాయని వాటిని అకారణంగా ఎందుకు చంపారని ప్రశ్నిస్తేఆయన వద్ద సమాధానం లేదు.
తర్వాత ఆశిష్ కుక్కపిల్లలను చంపినట్లు అంగీకరించాడు. వాటిని గోడకేసి కొట్టి చంపానని అంగీకరించాడు. వీధి కుక్కలు కొన్ని సార్లు కరుస్తాయని చెప్పాడు. తర్వాత స్థానికులు తనపై దాడి చేస్తారని భయపడ్డాడేమో కానీ.. ఏడుపు కూడా అందుకున్నాడు. అతని భార్య అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఆశీష్ లాంటి వాళ్లు సమాజానికి ముప్పు అని స్థానికులు మండిపడ్డారు. జంతువులపై ఏదైనా క్రూరత్వం భారతీయ న్యాయ సంహిత మరియు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. అందుకే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ కుక్కను పెంచుకుంటున్నాడు అంటే.. అతనికి దయా గుణం ఉందని అనుకుంటారు. కానీ ఇతను కుక్కను పెంచుకుంటున్నప్పటికీ వీధి కుక్కల పట్ల అత్యంత హీనంగా వ్యవహరించాడు. ఇలాంటి వ్యక్తి మనస్థత్వం సమాజానికి చాలా హానికరమని.. రోడ్ పై ఉన్న్ మనుషుల్ని కూడా ఆయన ఆలాగే ట్రీట్ చేసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతు సంరక్షణ కార్యకర్తలు ఆశీష్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. అతనిప ైకఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.