Leopard News:అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద చిరుత పులి చచ్చిపోయింది. అడవి పందులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకొని మృతి చెందింది. ఆటోలకు ఉపయోగించే బ్రేక్ వైర్లతో అడవి పందుల కోసం ఉచ్చును బిగించారు. ఆ ఉచ్చులో పడిన చిరుత చనిపోయింది. 

ఉచ్చు వేసిన సమీపంలో నీళ్ల కోసం అడవి జంతువులు వస్తుంటాయి. అడవి పందులు కూడా వస్తాయి. అందుకే ఇక్కడ ఉచ్చును ఏర్పాటు చేశారు. నీళ్లు, ఆహారం వెతుక్కుంటూ అడవికి ఆనుకున్న పొలం వద్దకు చిరుత వచ్చింది. వేట గాళ్ల అమర్చిన ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. వేటగాళ్లు వేసిన ఉచ్చులో నుంచి బయటపడేందుకు గంటల తరబడి చిరుత పోరాడింది. నరకయాతన అనుభవించి మృతి చెందింది. 

చిరుత పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్‌న చిరుత కడుపుతో ఉన్నట్టు అధికారులు చెప్పారు. కడుపులో  రెండు కూనలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత చిరుత పులికి పోస్టుమార్టం నిర్వహించిన పశు వైద్యులకు  చిరుత పులి గర్భంలో పిల్లలు ఉండడం గమనించి షాక్ అయ్యారు. మరో 20 రోజులు ఉండి ఉంటే ఆ పిల్లలు బతికుండేవనీ.. తల్లితోపాటు అవి కూడా చని పోయాయని తెలిపారు. 

ఇలా ఉచ్చు వేసి చిరుతలాంటి క్రూరమృగాలను చంపడం చట్టరీత్యా నేరం. వైల్డ్‌లైఫ్‌ ప్రొకెటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం చిరుతలను చంపడం వేటాడటం, లేదా వాటి శరీర భాగాలను విక్రయించడం నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టంలో జంతువులను వర్గీకరించారు. అలా వర్గీకరించిన జాబితాలో షెడ్యూల్‌ 1లోకి చిరుతలు వస్తాయి. 

వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం సెక్షన్ 9అండ్ సెక్షన్ 39 ప్రకారం చిరుతలను చంపడం గాయపరచడం నేరం. సెక్షన్ 51 ప్రకారం చిరుతలను చంపితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతోపాటు పాతికవేల రూపాయల జరిమానా వసూలు చేస్తారు. ఇదే నేరాన్ని రెండోసారి రిపీట్ చేస్తే శిక్షలు రెట్టింపు అవుతాయి. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు బెయిల్ రావడం కూడా కష్టమే. 

గతేడాది అక్టోబర్‌లో ఇలానే తిరుపతిలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో కొందరు చిరుతును చంపేశారు. వాళ్లను మూడు రోజుల్లోనే అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అన్నమయ్య జిల్లాలో జరిగన ఘటనపపై పోలీసులు, అటవీ శాఖాధికారులు విస్తృతంగా విచారిస్తున్నారు. 

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని విచారిస్తున్నారు. తరచూ ఇలాంటి పనులు చేసే వాళ్లు ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆ ప్రాంతంలో అడవి పంది మాంసం విక్రయించే వాళ్లపై కూడా కన్నేశారు. పనిలో పనిగా అడవి మృగాలను వేటాడొద్దని అధికారులు స్థానికులకు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేకో, ఇంకా వేరే కారణాలతో ఇలాంటి చర్యలకు పాల్పడిందే కేసుల్లో ఇరుక్కుంటారని చెబుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడతాయని వారిస్తున్నారు. ఇలాంటి తప్పులు చేయొద్దని వారికి అవగాహన కల్పిస్తున్నారు.