Kadapa SP Press Meet On Badwel Student Murder Case: కడప జిల్లా (Kadapa District) బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పథకం ప్రకారమే నిందితుడు విఘ్నేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్థన్ కేసు వివరాలు వెల్లడించారు. 'నిందితుడు విఘ్నేశ్‌కు బాధిత బాలిక (16)కు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. విఘ్నేశ్ కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 6 నెలల క్రితం వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతను విద్యార్థిని ఫోన్ చేసి తనను కలవాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేశ్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద ఆటో దిగారు. సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి సరదాగా కాసేపు గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విఘ్నేశ్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.' అని ఎస్పీ తెలిపారు.
పక్కా ప్లాన్‌తోనే..
బాలికకు నిప్పంటించిన నిందితుడు విఘ్నేశ్ ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ హర్షవర్థన్ తెలిపారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2:30 గంటలకు బాలిక మృతి చెందిందని చెప్పారు. 'బాలికను ఏదో ఒకటి చేయాలనే పథకంతోనే విఘ్నేశ్ ఆమెకు ఫోన్ చేశాడు. కడప నుంచి వచ్చేటప్పుడు ముందుగానే పెట్రోల్ బాటిల్ బ్యాగులో పెట్టుకుని బయలుదేరాడు. పథకం ప్రకారమే ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. గతంలోనూ ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో విఘ్నేశ్ కొంతకాలం ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని శనివారం కూడా బాలిక ఒత్తిడి చేయడంతోనే విఘ్నేశ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటనా స్థలంలో అన్నీ ఆధారాలు సేకరించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి త్వరగా శిక్ష పడేలా చూస్తాం.' అని ఎస్పీ తెలిపారు.
సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుడికి మరణశిక్ష స్థాయిలో కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'బద్వేల్‌లో యువకుడి పెట్రోల్ దాడిలో గాయపడ్డ ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఓ దుర్మార్గుడి దుశ్చర్యకు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని బలి కావడం విచారకరం. బాధిత కుటుంబానికి న్యాయం చేయడమంటే.. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఓ హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు.