Mother And Son Died Due To Current Shock In Kakinada: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెందగా.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా (Kakinada District) సామర్లకోటలోని 20వ వార్డులో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక వీర రాఘవపురం సత్తమ్మతల్లి ఆలయం సమీపంలో నివసిస్తోన్న చిట్టిమని పద్మ (40) శనివారం ఇంటి పక్కన ఉన్న కాల్వలోకి తుళ్లిపడి మృతి చెందారు. ఆదివారం ఆమె కుమారుడు విశ్వేస్ (23) కూడా అక్కడే దుస్తులు ఆరేసే తీగను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అయితే, పద్మ కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


రోడ్డు ప్రమాదంలో..


అటు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ - హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇటీవల వచ్చిన వరదలకు గరికపాడు వంతెన దెబ్బతింది. ఈ క్రమంలో పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో ఎదురెదురుగా వస్తోన్న రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరోవైపు, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మొండికట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టగా.. అది ఎదురుగా వస్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వినుకొండ, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


ఈతకు వెళ్లి విద్యార్థులు


అటు, కృష్ణా జిల్లాలో క్వారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లారు. గుంతలు లోతుగా ఉండడాన్ని గమనించిన విద్యార్థులు నీటిలో దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీటిలో పడి తిరువూరుకు చెందిన దుర్గాప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్ రాజు అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు