Kadapa Accident: కడప జిల్లా తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సిఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లదుర్తి గ్రామానికి చెందిన దంపతులు సిరంగి దస్తగిరి (45), సిరంగి సరస్వతి (35) అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి పోట్లదుర్తి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్దకు రాగానే తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పట్నం ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గుర్తించిన స్ఖానికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన 108 సిబ్బంది క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. భార్యాభర్తలిద్దరూ ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్ - అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నడుపుతున్న ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ కు ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు పై నడిచి వెళ్తున్న బాలుడి పైకి దూసుకెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం పక్కనే ఉన్న ఇంట్లోకి కూడా బస్సు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
పది రోజుల క్రితం చిత్తూరులో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాణిపాకం పట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతులు బెంగుళూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. పాల ట్యాంకర్ వెనుక భాగంలో చిక్కుకున్న కారును వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
అసలేం జరిగింది?
చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలోని తవణంపల్లి మండలం కాణిపాక పట్నం వద్ద వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పాల ట్యాంకర్ ను వెనుక వైపు నుంచి కారు అతి వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్ గల పాల టాంకర్ ముందుగా వెళుతుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ చెందిన కారు (నంబర్ KA 53 MH 1858 ) వెనుక వైపున ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన అద్దంకి అశోక్ బాబు అతని భార్య కుమారుడు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. వర్షం కురుస్తుండడం అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో మృతుల వివరాలు పూర్తిస్థాయిలో తెలియ రాయడం లేదు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఆర్డీవో రేణుక, డిఎస్పి శ్రీనివాస్ మూర్తి , సీఐ శ్రీనివాసులు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను అతి కష్టం మీద వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తవణంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.