తెలంగాణ‌లో జనశక్తి నక్సల్స్ సమావేశం జరిగిందని ప్రచారం జరగడంతో సిరిసిల్ల పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. సిరిసిల్ల జిల్లా పోలీసులు జనశక్తి సమావేశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నేడు జనశక్తి సభ్యులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో జనశక్తి సమావేశం నిర్వహించినట్టుగా చెబుతున్న విశ్వనాథ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 
అనారోగ్యంతో ఉన్న జనశక్తి నేత ఆనంద్(బొమ్మని నరసింహ)ను చౌటుప్పల్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు  అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన జనశక్తి నేతల్ని తక్షణమే కోర్టులో హాజరు పరచాలని వారి కుటుంబసభ్యులతో పాటు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్, పిడిఎస్‌యూ ఓయూ నాయకులు కోట ఆనంద్, అల్లూరి విజయ్ డిమాండ్ చేశారు.


జనశక్తి నేతల అరెస్ట్
విశ్వనాథ్, అశోక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించారని  విశ్వనాథ్ పేరుతో జనశక్తి లేఖ విడుదల కావడం తెలిసిందే. ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని, ఆ లేఖలోని విషయాలు వాస్తవం కాదని విశ్వనాథ్ పోలీసులకు తెలిపాడు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాథ్ నేతృత్యంలో సిరిసిల్ల సరిహద్దుల్లోని పోతురెడ్డిపల్లి ఫారెస్ట్ లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారని ప్రచారం జరిగింది. వీరిలో 8 మంది జనశక్తి నక్సల్స్ సాయుధులు, 70 మంది వరకు జనశక్తి సానుభూతిపరులు సమావేశంలో పాల్గొన్నారని సమాచారం. సిరిసిల్ల , కొనరావేపేట్, ఎల్లారెడ్డి పెట్, గంభీరావ్ పేట్, ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలు కూడా ఉన్నట్టుగా సమాచారం. 


బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. సిరిసిల్ల ఎస్పీ
జిల్లాలో జనశక్తి నేతలు ఈనెల 12వ తారీకు నుండి 14వ వరకు సమావేశాలు నిర్వహించారన్న అంశంపై సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. సమావేశం జరిగినట్లు ఆధారాల కోసం చూస్తున్నట్లు తెలిపారు. జనశక్తి మీటింగ్ ప్రచారం వెనక కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఎవరైనా జనశక్తి పేరుతో డబ్బుల వసూళ్లు పాల్పడినా, బెదిరింపులకు గురి చేసినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నిఘా వర్గాలు అప్రమత్తమై నక్సల్స్, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. జిల్లాలో మావోయిస్టులు, నక్సల్స్ లేరని, ఆందోళన చెందవద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.
Also Read: DS In Dilemma: ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన డీఎస్ ఏ పార్టీలో చేరతారు ! ఎటూ తేల్చుకోలేకపోతున్న కీలక నేత 


జనశక్తి సమావేశంపై సెంట్రల్ కమిటీ లేఖ..
రాజన్న సిరిసిల్ల జిల్లా పోతనపల్లి అటవి ప్రాంతంలో 'జనశక్తి సమావేశం' అనే కథనం నిజం కాదు, అధికారికం అంతకంటే కాదని జనశక్తి కేంద్ర కమిటీ సభ్యులు చంద్ర ప్రకాష్ లేఖ విడుదల చేశారు. పోతనపల్లి అడవిలో ' జనశక్తి సమావేశం' అంటూ ఎలక్ట్రానిక్-ప్రింట్ మీడియా, న్యూస్ ఆన్లో వచ్చిన వార్త అధికారికమైనది కాదు, బూటకమని పేర్కొన్నారు. జనశక్తి వ్యవస్థాపకులు నేటికి విప్లవోద్యమ నిర్మాణంలో కీలకంగా ఉన్నారని విశ్వనాథ్ పేరిట గతంలో తెలుగు రాష్ట్రాల కార్యదర్శిగా పత్రిక ప్రకటనలు వచ్చింది నిజమే నైనా నేడు నేనే విశ్వనాథ్ నని చెప్పుకుంటున్న వ్యక్తి అప్పుడూ ఇప్పుడూ కార్యదర్శి కాదని వివరించారు.