Jammu Tunnel Collapse: జమ్ముకశ్మీర్‌లోని నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో మరణాల సంఖ్య 10కి చేరింది. నిన్న కొందరి మృతదేహాలు వెలికితీయగా.. నేడు తీసిన డెడ్‌బాడీస్‌తో కలిపి మొత్తం 10 వెలికితీశామని అధికారులు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని రాంబాన్ ఎస్‌ఎస్‌పీ మోహితా శర్మ చెప్పారు. చనిపోయిన వారిలో ఐదుగురు పశ్చిమ బెంగాల్, ఇద్దరు నేపాల్, ఒకరు అస్సాంకు చెందిన వారు కాగా, ఇద్దరు స్థానికులు అని జాతీయ మీడియా ఏఎన్‌ఐ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలో గురువారం రాత్రి కొంత భాగం కూలిపోయింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ తో కొందరి ప్రాణాలు కాపాడారు. అయినా శిథిలాల కింద చిక్కుకున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారని రెస్క్యూ టీమ్ తెలిపింది. శుక్రవారం సాయంత్రం మరో కొండచరియ విరిగిపడటం వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. నేడు మరో 3 డెడ్‌బాడీస్‌ను వెలికితీయగా మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది.