Jammu Bus Accident: జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము జిల్లాలో వంతెన పైనుంచి వెళ్తుండగా... ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణికులతో నిండిన బస్సు అమృత్‌సర్ నుంచి కత్రాకు వెళ్తుండగా.. ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుతుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులందరినీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. బస్సులో దాదాపు 70 నుంచి 75 మంది ఉన్నారని, వారిలో కొందరు అక్కడికక్కడే మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అదే సమయంలో కొందరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అలాగే తీవ్రంగా గాయపడిన నలుగురిని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి తరలించారు. ఇది కాకుండా, గాయపడిన మరో 12 మందిని స్థానిక పిహెచ్‌సికి పంపారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.
బస్సులో మాతా వైష్ణోదేవి భక్తులు
జమ్మూకి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలోని ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో వైష్ణో దేవి మాతా ఆలయానికి వెళ్లే భక్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఉదయమే ఈ ప్రమాదం జరగగా.. సమీప ప్రాంతాల ప్రజలు, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. బస్సు కాలువలో పడిపోయిందని, ఆ తర్వాత పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు తెలిపారు. బస్సులోని పలువురు వ్యక్తులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.