Jagtial Crime : జగిత్యాలలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల క్రితం కొడుకును హత్య చేసిన కిరాతకుడు ఇవాళ భార్య హతమార్చాడు. కన్న కొడుకు అనే విచక్షణ లేకుండా మూడేళ్ల క్రితం దారుణానికి పాల్పడిన నిందితుడు తిరిగి మరో ఘోరానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో భార్యను కిరాతకంగా చంపాడు భర్త.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలకుంట గ్రామానికి చెందిన నక్క గంగవ్వ ఆదివారం పొలంలో నాట్లు వేస్తుండగా భర్త నక్క రమేష్ ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో గంగవ్వ మరణించింది.  స్థానికుల సమాచారంతో  సంఘటన స్థలానికి పెగడపల్లి ఎస్సై శ్వేత మల్యాల, సీఐ రమణమూర్తి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు రమేష్ మూడేళ్ల క్రితం సొంత కొడుకును కూడా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.


అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి 


 నాలుగు సంవత్సరాల బాలుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మాలోత్ రవికి ఇందిర, సరిత ఇద్దరు భార్యలు. చిన్న భార్య సరిత కుమారుడు నేహల్(4) తండ్రితో కలిసి నిన్న రాత్రి పెద్ద భార్య ఇందిర ఇంటికి వెళ్లి చికెన్ తో భోజనం చేశాడు. అనంతరం నిహల్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. పెద్ద భార్య ఇందిర అన్నంలో విషం కలపడంతో తన కుమారుడు చనిపోయాడని సరిత ఆరోపిస్తుంది. విష ప్రయోగానికి బలై మృతి చెందాడని, గతంలో  తన కూతురును కూడా ఇదే విధంగా హతమార్చారని సరిత ఆవేదనను వ్యక్తంచేశారు. తన కుమారుడిని హతమార్చిన రవి, పెద్ద భార్య ఇందిరపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తుంది.  



 మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి


పెళ్లిళ్లు, విందులు, ఇతర ఫంక్షన్లకు పిలవగానే వెళ్లిపోతుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ పెడుతున్నారంటే మరింత ఎక్కువ మంది వెళ్తుంటారు. పెళ్లిళ్లలో మాంసాహారం పెట్టలేదని తెలిస్తే చాలా మంది గొడవ కూడా చేస్తుంటారు. అయితే అలా ఓ పెళ్లిలో పెట్టిన నాన్ వెజ్ వల్లే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏంటీ మాంసాహారం వల్ల వ్యక్తి చనిపోయాడా అనిపిస్తోందా.. అవును నిజమేనండి. సదరు వ్యక్తి వివాహ విందులో భోజనం చేస్తున్నాడు. సడెన్ గా ఓ మాంసం ముక్క గొంతుల్లో ఇరుక్కుపోయింది. ఈ కారణంతో అతడు శ్వాస ఆడక అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు విడిచాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హునుమాన్ ఫారమ్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే నవీపేటకు చెందిన 45 ఏళ్ల రమణా గౌడ్ బంధువుల పెళ్లికి వెళ్లాడు. అందరితో కలిసి మాట్లాడాడు. వధూవరులను కూడా ఆశీర్వదించాడు. ఆపై భోజనం చేసేందుకు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టించుకొని వచ్చి తింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ మాంసం ముక్క అతడి గొంతుకు అడ్డుపడింది. దీంతో శ్వాస ఆడక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు విడిచాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు, బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా పోలీసులు కూడా వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.