Chikoti Case : ప్రవీణ్ చికోటి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రోజుల పాటు ప్రవీణ్ చికోటితో పాటు మరో ముగ్గురు అతని అనుచరుల్ని.. వ్యాపార వ్యవహారాలు నడిపే వారిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి రాబట్టిన సమాచారం.. వారి వాట్సాప్ చాట్‌లలో లభించిన ఆధారాల ఆధారంగా నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యేగా చెబుతున్నారు. వీరి పేర్లేమిటో బయటకు రాలేదు. వీరందరూ శనివారమే విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ నోటీసులు
చికోటి ప్రవీణ్ తాను కేసినో ఆడించానని చెబుతున్నారు. కేసినో ఆడాలనుకున్న వారిని తానే ఇతర ప్రాంతాల్లోని కేసినోల వద్దకు తీసుకెళ్లానని అంగీకరిస్తున్నారు. అయితే ఈకేసులో కేసినో ఆడటంపై ఈడీ దర్యాప్తు చేయడం లేదు. కేసినో పేరుతో జరిగిన మనీలాండరింగ్ అంశంపైనే ఈడీ విచారణ జరుగుతోంది. ఈ క్రమంమలో చికోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారిపై ఈడీ గురి పెట్టింది. ఆయనతో పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. వారు ఆయన ద్వాలా కేసినోలకు వెళ్లారని ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. వారంతా ఇక్కడ నగదు జమ చేసి.. కాయిన్స్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్లి కేసినోలు ఆడారని తెలుస్తోంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఓ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ?
ఈడీ నోటీసులు జారీ చేసిన నలుగురు ప్రముఖుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఒకరు మాజీ ఎమ్మెల్యేగా చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఏపీ వారా.. తెలంగాణ వారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. తెలంగాణకు చెందిన ఓ జిల్లా జడ్పీ చైర్మన్ పేరు మాత్రం జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వారంతా ఖండించారు. తమకు చికోటి ప్రవీణ్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులు ఎవరెవరికి జారీ చేసిందనేది బయటకు తెలిస్తే రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది.
శనివారమే విచారణ
శనివారమే ఆ నలుగురిని విచారణకు రమ్మని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే సమయం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చినందున వారంతా డుమ్మా కొట్టడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈడీ ఇలాంటి విచారణలకు హాజరు కాకపోతే.. ఆయా వ్యక్తుల ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేస్తుంది. ఈడీ విచారణను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరని చెబుతున్నారు. మొత్తంగా చికోటి చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు స్పందించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రకటన అవాస్తమని తెలిపారు.