Attack On Red Fort: 


ఎర్రకోటపై అటాక్‌కి ప్లాన్  


ఢిల్లీ పోలీసులు సంచలన విషయం వెల్లడించారు. ఎర్రకోటపై ఉగ్రదాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందని తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన ISI ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఈ ఏడాది జనవరిలోనూ ఢిల్లీలో ఉగ్రకదలికలు ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలోనే నిఘా పెట్టి ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఎర్రకోట వద్ద ఉన్న సెక్యూరిటీపై కాల్పులు జరిపేందుకే వీళ్లు ఢిల్లీకి వచ్చినట్టు విచారణలో తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛార్జ్‌షీట్‌ కూడా రెడీ చేసింది. మే 10వ తేదీన పటియాలా హౌజ్ కోర్టులో దీన్ని సమర్పించింది. పంజాబ్, హరిద్వార్‌లో బజ్‌రంగ్ దళ్ నేతల్ని హత్య చేసేందుకూ కుట్ర చేసినట్టు ఇందులో వెల్లడించింది. నౌషద్, జగ్జీత్ అనే ఇద్దరు ఉగ్రవాదులు ఈ ప్లాన్ చేసినట్టు స్పష్టం చేసింది. పైవాళ్లను మెప్పించేందుకు ఓ హత్య కూడా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ హిందూ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఢిల్లీలోని భల్‌స్వా డెయిరీకి తీసుకెళ్లారు. అక్కడే గొంతు కోసి చంపేశారు. ఆ వీడియోని పై వాళ్లకు పంపారు. ఆ తరవాతే ఎర్రకోట వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడికి ప్లాన్ చేశారు. పాకిస్థాన్‌ నుంచి తమకు ప్లాన్ పంపారని, అందుకు తగ్గట్టుగానే దాడి చేసేందుకు సిద్ధమయ్యామని పోలీసుల విచారణలో ఇద్దరు ఉగ్రవాదులూ అంగీకరించారు. అంతే కాదు. భారత్‌లో పెద్ద టెర్రర్ గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌నీ ఏర్పాటు చేసేందుకు కుట్ర చేసినట్టు చెప్పారు. ISI ఇచ్చే సూచనల ఆధారంగానే పని చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. 


గతంలోనూ హెచ్చరికలు..


గతంలోనూ నిఘా వర్గాలు సంచలన విషయం చెప్పాయి. అయోధ్య రామ మందిరంపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు వెల్లడించాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపాయి. ఆత్మాహుతి దాడి ద్వారా ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నట్టు చెప్పాయి. నేపాల్ మీదుగా భారత్‌కు సూసైడ్ స్క్వాడ్‌ను పంపాలని చూస్తున్నట్టు తేల్చి చెప్పాయి. నిఘా వర్గాల హెచ్చరికతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే రోజున పంజాబ్, ఢిల్లీతో పాటు మరి కొన్ని కీలక నగరాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. రోహింగ్యాల ద్వారా పలు చోట్లు IED బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్టు హెచ్చరించాయి. ఒకవేళ జనవరి 26న ఈ ప్లాన్ అమలు కాకపోతే..ఆ తరవాత జరిగే G20 సమ్మిట్‌ను టార్గెట్ చేయనున్నట్టు చెప్పాయి. హైదరాబాద్‌పైనా దాడికి కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన Lone Wolf Attack సంస్థ ఈ దాడికి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ కుట్ర వెనకాల ISI,లష్కరేతోయిబా కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలతో అరెస్ట్ అయిన ఉగ్రవాది జహీద్‌కు సంబంధాలున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పాక్ నుంచి అతడికి హ్యాండ్ గ్రనేడ్‌లు కూడా సప్లై చేసినట్టు విచారణలో తేలింది.


Also Read: AAP vs L-G Row: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కి సుప్రీంకోర్టు షాక్, ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలని తీర్పు