AAP vs L-G Row: 


ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పుని ధర్మాసనం తోసి పుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలని వెల్లడించింది. శాసన, కార్యనిర్వాహక అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే..పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ వ్యవహారాల్లో మాత్రం ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలన్న నిబంధన వర్తించదని తెలిపింది. మిగతా అన్ని వ్యవహారాల్లోనూ ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అయితే...2019లో కింది కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని వ్యవహారాలపై అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. Article 239AA ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. అయితే...ఈ ఆర్టికల్‌ పోలీస్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం వర్తించదని వివరించింది. National Capital Territory of Delhi (NCTD)కి సంబంధించి అధికారాలను ఎన్నికైన ప్రభుత్వానికే బదిలీ చేయాలని తెలిపింది. 


"రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేతుల్లోకి తీసుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాష్ట్ర వ్యవహారాలను ప్రభావితం చేయాలని చూడడం సరికాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. ఆఫీసర్లపైనా కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలకు అధికారులు లోబడి ఉండకపోతే బాధ్యత అనేదే లేకుండా పోతుంది. ప్రభుత్వానికి, అధికారులకు దూరం పెరిగితే..జవాబుదారీతనం తగ్గితే సమస్యలొస్తాయి. తమకు ప్రాధాన్యత లేదని అధికారులు భావించే ప్రమాదముంది. "


- సీజేఐ చంద్రచూడ్ 




ఈ అధికారాల వ్యవహారమై ఆప్ సర్కార్ 2019లోనే ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పట్లో ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపారు. ఇద్దరూ వేరు వేరు వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ అశోక్ భూషణ్...ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉండవని తేల్చి చెప్పగా...జస్టిస్ సిక్రీ మాత్రం ఉన్నతాధికారుల నియామకంలో కేంద్రానికే అధికారం అని వెల్లడించారు. 2018లోనూ సుప్రీంకోర్టు ఇదే విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సామరస్యంగా ఉండాలని సూచించింది.