Inter Student Forceful Death In Annojigooda In Medchal District: మేడ్చల్ జిల్లాలో (Medchal District) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న తనుష్ నాయక్ (16) బాత్రూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. వారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. లెక్చరర్ వేధింపుల వల్లే తమ బిడ్డ సూసైడ్ చేసుకున్నాడని తండ్రి ఆరోపించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు


ఈ ఘటనతో పేరెంట్స్, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు యత్నించారు. మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా.. పోలీసులు వారిని అడ్డుకుని ప్రిన్సిపాల్‌ను విడిపించారు.


మరో ఘటన


అటు, ఇదే మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ఎంఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో ప్రజ్ఞ (17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. విద్యార్థినిది నిజామాబాద్ జిల్లా చిన్నతాడ్ గ్రామం. విద్యార్థిని మృతిపై కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశాయి. ఈ క్రమంలో కళాశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేయగా ఉద్రిక్తత తలెత్తింది.


Also Read: Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి