Indonesia Earthquake Latest News: ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపంలో మొదట 30, 40 మంది చనిపోయారని భావించగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. సోమవారం రాత్రి 9 గంటల వరకు మరణాల సంఖ్య 162కు పెరిగింది. భూకంప కేంద్రం ఇండోనేషియా రాజధాని జకార్తాకు 75 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ జావాలోని సియాంజర్ వద్ద భూకంప కేంద్రం ఉంది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు.
సౌత్ జకార్తాల్లోని నగరాల్లో పలుచోట్ల సోమవారం భూమి కంపించింది. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కానీ కొన్ని చోట్ల భారీ భవంతులు కూలిపోయి వందకు పైగా ప్రాణ నష్టం సంభవించింది. 700 మందికి పైగా గాయపడి ఉంటారని, బాధితులు ఉన్న చోటుకు అంబులెన్స్ లు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం...వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సినాజుర్ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. 10 కిలోమీటర్ల లోతు వరకూ దీని తీవ్రత నమోదైందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయి. గ్రేటర్ జకార్తా ప్రాంత ప్రజలు ఈ ధాటికి భయంతో వణికిపోయారు. ఎత్తైన భవనాలు దాదాపు మూడు నిముషాల పాటు కంపించాయి. అప్పటికప్పుడు ఆ భవనాల్లోని వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. "భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని మేమంతా పరుగులు పెట్టాం" అని ఓ ఉద్యోగి వెల్లడించారు.
ఇండోనేషియాలో భూకంపాలు తరచుగా నమోదవుతూనే ఉంటాయి. సునామీలు, భూకంపాలకు కేంద్రంగా మారిపోయింది ఈ దేశం. గతేడాది డిసెంబర్‌లోనూ భారీ భూకంపం నమోదైంది. మొదట 7.6 తీవ్రత ఉన్నట్లు ప్రకటించారు. ఆపై భూకంప కేంద్రాన్నిగుర్తించి, తీవ్రతపై క్లారిటీ ఇచ్చారు. సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పసిఫిక్ మహాసముద్రంలో తరచుగా భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉందని జియాలాజికల్ సర్వే అధికారులు హెచ్చరిస్తుంటారు. గతంలో 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం అనంతరం సునామీగా మారి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం జకార్తాలో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంఖ్య 40కి పైగానే ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.