Indian Student Dead in Italy:
ఝార్ఖండ్ విద్యార్థి మృతి..
ఝార్ఖండ్‌కి చెందిన ఓ స్టూడెంట్ ఇటలీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఝార్ఖండ్‌లోని సింగ్బం జిల్లాకి చెందిన రామ్ రౌత్ జనవరి 2న చనిపోయినట్టు స్థానిక ఇటలీ పోలీసులు వెల్లడించారు. MBA చేసేందుకు రామ్ రౌత్ ఈ మధ్యే ఇటలీ వెళ్లాడు. ఓ చోట ఇల్లు రెంట్ తీసుకుని ఉంటున్నాడు. న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు తల్లిదండ్రులు కాల్ చేశారు. ఎంతకీ ఫోన్ అటెండ్ చేయకపోవడం వల్ల ఆందోళన చెందారు. ఆ తరవాత రామ్ ఉంటున్న ఇంటి ఓనర్‌కి కాల్ చేశారు. అయితే...అప్పటికే అతను చనిపోయినట్టు చెప్పారు. మరో ఇంట్లో బాత్‌రూమ్‌లోనే అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉన్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తల్లిదండ్రులు ఝార్ఖండ్‌లో సీనియర్ అధికారులను సంప్రదించారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకి రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటికే రామ్ రౌత్ మృతికి సంబంధించిన సమాచారం అందిందని స్పష్టం చేశారు. హోంశాఖకు సమాచారం అందించామని మైగ్రేషన్ సెల్‌కి కూడా వివరాలు చెప్పామని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరినట్టు వివరించారు. కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
యూకేలోనూ..
ఇటీవల యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి జీఎస్ భాటియా మృతి చెందాడు. ఈస్ట్ లండన్‌లోని ఓ సరస్సులో అతడి మృతదేహం కనిపించింది. గతేడాది డిసెంబర్ 14వ తేదీ రాత్రి నుంచి భాటియా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఓ లేక్‌లో శవమై తేలాడు. దాదాపు వారం రోజులుగా భాటియా జాడ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల CC కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫోన్ డేటానీ సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఓ సరస్సులో తనిఖీలు చేపట్టారు. అందులోనే భాటియా డెడ్‌బాడీ దొరికింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకూ ఇది అనుమానాస్పద మృతి అనడానిక ఆధారాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే...భాటియాకి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే భాటియా మృతి పట్ల సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ వివాదం ఉద్ధృమవుతున్న సమయంలో భారత్‌కి చెందిన ఓ సిక్కు విద్యార్థి ఇలా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం అలజడి సృష్టిస్తోంది. భాటియా మిస్సింగ్ కేసుని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా. భాటియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలోనూ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ అదృశ్యమయ్యాడు. చివరికి థేమ్స్ నదిలో శవమై తేలాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చదువుకునేందుకు లండన్‌కి వచ్చిన మిత్‌కుమార్ నవంబర్‌లో చనిపోయాడు. అయితే..ఇది అనుమానాస్పద మృతి కాదని పోలీసులు వెల్లడించారు.
Also Read: బీచ్ టూరిజంలో భారత్ మాతో పోటీ పడలేదు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ అక్కసు