Crime News :    అంబర్ పేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో విద్యార్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం.. తనతో పాటు పాటు ప్రిన్సిపాల్‌కు అంటించే ప్రయత్నం చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే అసలేం జరిగిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నిజానికి ఇది హత్యా ప్రయత్నం లేదా ఆత్మహత్యా ప్రయత్నం కాదని ప్రమాదవశాత్తూ జరిగిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే .. 


విద్యార్థికీ టీసీ ఇచ్చి పంపించాలనుకున్న స్టూడెంట్ 


అంబర్ పేటలోని ప్రైవేటు కాలేజీలోసాయి నారాయణ అనే విద్యార్తి చదువుతున్నాడు. అతను కాలేజీ ఫీజు కట్టలేదు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండే సాయి నారాయణ కాలేజీకి కూడా తక్కువగానే హాజరయ్యేవాడు.  దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి టీసీ ఇచ్చి  పంపించేస్తానని హెచ్చరించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సాయి నారాయణ..తాను ఎక్కువగా తిరిగే విద్యార్థి సంఘం నేత  సందీప్‌గౌడ్‌ను తీసుకుని .. ప్రిన్సిపాల్‌తో మాట్లాడేందుకు కాలేజీకి వచ్చారు. నేరుగా ప్రిన్సిపాల్ చాంబర్‌లోకి వెళ్లాడు. అయితే ప్రిన్సిపాల్ సాయినారాయణ విషయంలో తన నిర్ణయం వెనక్కి తీసుకునేందుకు నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది.  


తన తరపున మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకుడ్ని తెచ్చుకున్న స్టూడెంట్


అప్పటికే ప్రిన్సిపాల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం..  టీసీ ఇచ్చి పంపించేయాలని నిర్ణయించడంతో  సాయినారాయణను ఎలాగైనా కాలేజీలో కొనసాగించేలా చేయాలన్న పట్టుదలతో  విద్యార్థి సంఘం నేత సందీప్ గౌడ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఓ బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకున్నారు. తనపై లేదా ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి బెదిరించాలని ఆయన అనుకున్నారు. అయితే ఇక్కడే సందీప్ గౌడ్ అసలు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఈ రోజు కృష్ణాష్టమి కావడంతో కాలేజీలో పూజ చేశారు. ప్రిన్సిపాల్ చాంబర్‌లోనూ పూజ చేశారు. అక్కడ పటాల వద్ద దీపం వెలుగుతూనే ఉంది. సందీప్ గౌడ్ ఈ విషయాన్ని గుర్తించలేదు.  ప్రిన్సిపాల్ ఎంత చెప్పినా వినకపోయేసరికి..పెట్రోల్ బాటిల్ తీసి తనపై పోసుకున్నాడు. కానీ దీపం మంటల దగ్గరే ఉండటంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. 


బెదిరించేందుకు పెట్రోల్ పోసుకున్న విద్యార్థి సంఘం నేత - దేవుని పటాల దగ్గర ఉన్న దీపం కారణంగా మంటలు 


మంటలు అంటించుకునే ఉద్దేశం లేని సందీప్ కూడా  ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు . ఆ షాక్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు తన పక్కన ఉన్న వారిని కూడా పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి.. ఏవో అశోక్ రెడ్డితో  పాటు మరి  కొందరికి గాయాలయ్యాయి. హుటాహుటిన అందర్నీ ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా ఓ విద్యార్థి సరిగ్గా కాలేజీకి రాకపోవడంతో.. టీసీ ఇచ్చి పంపించేయాలనుకున్న ప్రిన్సిపాల్ ను.. విద్యార్థి సంఘం నేత బెదిరించేందుకు చేసిన ప్రయత్నంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. 


మునావర్‌ షోకు అనుమతి - రాజాసింగ్ హౌస్ అరెస్ట్ ! సీరియస్ మ్యాటర్‌గా స్టాండప్ కామెడీ !