iBOMMA Website Case: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందని భావించడం లేదన్నారు హైదరాబాద్ పోలీసులు, వారు అన్నట్టుగానే గురువారం నుంచి ఐబొమ్మ ప్లేస్‌లో మరో వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. అందులో కూడా కొత్త కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది రవి లాంటి వాళ్లు వందల్లో ఉండటం వల్లే పైరసీ విపరీతంగా పెరిగిపోతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ప్రాంతానికి చెందిన టీం వల్ల అరికట్టే పరిస్థితి లేదని దేశంలోని పోలీసులంతా చేతులు కలిపితేనే అరికట్టగలమని అంటున్నారు. దీంతోపాటు కొత్తగా వస్తున్న సాంకేతికతను సినిమా ఇండస్ట్రీ అందిపుచ్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వారు సినిమా ప్రదర్శించే ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయని అందుకే పైరసీకేటుగాళ్లు ఈజీగా హ్యాక్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
చాటుగా రికార్డు చేస్తున్న కేటుగాళ్లు
పైరసీ కేటుగాళ్లు ఇచ్చే డబ్బులకు ఆశపడే యువకులు ఏదో మార్గంలో థియేటర్‌లో సినిమాలు చిత్రీకరిస్తున్నారని ఒకరు పాప్‌కాన్ మధ్య లో సెల్‌ఫోన్ పెట్టి చిత్రీకరిస్తే, మరికొందరు థర్డ్ పార్టీ యాప్‌ల సహాయంలో సెల్‌ఫోన్ స్విచాఫ్‌చేసి సినిమాలు రికార్డు చేస్తున్నారు. ఇంకొందరు సినిమాలు రిలీజ్ కాకుండానే సర్వర్‌లను హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్‌లను సైట్‌లో రిలీజ్‌కు ముందే పెట్టేస్తున్నారు.
డబ్బు ఆశతో బుట్టలోకి
వీళ్లందర్నీ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు లీడ్ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడ తమ కార్యకలాపాలను రన్ చేస్తున్నారని చెబుతున్నారు. యువతకు భారీగా నగదు ఇస్తూ బుట్టలో వేసుకుంటున్నారని అనుమానిస్తున్నారు.
మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నటైంలో హైదరాబాద్‌లో రవిని అరెస్టు చేయడంతో ఓ ఊపు వచ్చింది. గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా పైరసీ భూతానికి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దీనికి సినిమా ఇండస్ట్రీ పూర్తి సహకారం అందిస్తుందని సినిమా పెద్దలు చెబుతున్నారు. దీనిపై కార్యచరణ రూపొందించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్లాన్లు వేస్తున్నారు. పోలీసులు కూడా పైరసీ ముఠాలు ఆటకట్టించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
లింక్‌లు లేకుండా చేసుకున్న రవి
మరోవైపు ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఎవరి వివరాలు లేవు. కేవలం ఫుడ్ డెలవరీ బాయ్స్‌కు నెంబర్లు మాత్రమే ఉన్నాయి. చాలా కాలం క్రితం భార్య నుంచి విడిపోయిన రవి, తల్లిదండ్రులకి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు. ఒక ఫ్రెండ్ మినహా ఎవరితో కూడా టచ్‌లో లేడు. ఆయన ఇంట్లో పని మనుషులు కూడా లేరు. తన గురించి బయటకు తెలిసిపోతుందని అనుమానంతో ఎవరిని పనికి పెట్టుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయన ఉంటున్న ఇంటింకి స్మార్ట్ లాక్, డోర్ కెమెరాలు పెట్టుకున్నాడు. తన ఇంటి వైపుగా ఎవరు వస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ఈ సెటప్ చేశాడు. ప్రస్తుతానికి రవితో ఎవరెవరికి లింక్‌లు ఉన్నాయో తెలుసుకోవడానికి వీలు లేకుండా చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఇంతకంటే ముందుకు వెళ్లలేకుండా పోయింది.
నివారణ ఒకటే మార్గం: సీవీ ఆనంద్
రవి లాంటి వాళ్ల నుంచి విముక్తి రావాలంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూసిస్తున్నారు. ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరని, కచ్చితంగా దీని వెనుక పెద్ద పెద్ద స్కామ్‌లు ఉంటాయని గుర్తించాలన్నారు. ముఖ్యంగా నెట్‌లో ఉచితంగా వస్తుందంటే దాని వెనుక ఏదో పెద్ద మోసం ఉంటుందని ఈ పైరసీ కూడా అలాంటిదేనన్నారు. మీ అకౌంట్లు, వివరాలు సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఇలాంటి పైరసీ వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.