Ganza Milkshakes In Hyderabad: గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వీటి ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు కొత్త దారుల్లో వీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల కొన్ని చోట్ల చాక్లెట్ల రూపంలో గంజాయిని గుర్తించగా.. ఇప్పుడు పౌడర్ రూపంలో దొరకడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా గంజాయితో చేసిన మిల్క్ షేక్ ల రూపంలో మార్కెట్లో అమ్మడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా గంజాయి పొడిని పాలల్లో సైతం కలుపుకొని తాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కిరాణా దుకాణంలో గంజాయి పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని పాలల్లో కలుపుకొని మిల్క్ షేక్స్ రూపంలో తాగుతున్నారని సదరు షాప్ ఓనర్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని యువతను తప్పుదోవ పట్టించగా.. దుకాణం యజమాని మాటలు విని మిల్క్ షేక్ తాగిన వారు ఏకంగా 7 గంటలు మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం.. దుకాణంపై దాడి చేసి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయి, అలాగే 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సరఫరా చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై మరింత విచారణ చేస్తున్నారు.


Also Read: Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో