Hyderabad Woman Suicide: సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మేనరికపు వివాహం కారణంగా తమకు పుట్టిన పిల్లలు చనిపోతారని భయంతో.. ఓ తల్లి తన ఇద్దరు కవలలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పదిహేను రోజుల వయసు మాత్రమే ఉన్న ఇద్దరు శిశువులను నీటి సంపులో పడేసి ఆపై తాను కూడా అదే సంపులో దూకి బలవన్మరణం చేందింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 




అసలేం జరిగిందంటే...?


సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంధ్యా రాణి అనే వివాహిత గతంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినిచ్చింది. పుట్టిన కొన్నాళ్లకే ఇద్దరు పిల్లలు మృతి చెందారు. దీంతో సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే సంధ్యా రాణి మరోసారి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తనది మేనరికం పెళ్లి కావడం.. గతంలో ఇద్దరు పిల్లలు అందుకే చనిపోయారని భావించిన ఈమె.. ఈసారి పుట్టిన కవల పిల్లలు కూడా చనిపోతారేమోనని భావించింది. ఆ ఊహనే తట్టుకోలేకపోయింది. అలా చనిపోవడం కంటే పిల్లలు లేకుండా తాను బతకలేనని భావించి వారితో పాటే తాను ప్రాణాలను తీసుకోవాలనుకుంది. వెంటనే నీటి సంపును తెరిచి పిల్లలిద్దరినీ అందులో పడేసింది. ఆపై తాను కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 


నీటిసంపులో చిన్నారులతో సహా సంధ్యారాణి మృతదేహం


నీటి సంపు మూత తెరిచి ఉండడం, సంధ్యా రాణితో పాటు పిల్లలు కనిపించకపోవడంతో.. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సంపులో చూసే సరికి ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఓ వైపు గట్టిగా ఏడుస్తూనే మరోవైపు స్థానికులను పిలిచారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కవల శిశువులతో పాటు సంధ్యారాణి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పిల్లలు పుట్టి ఆనందంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముగ్గురి మృతిని చూసి తట్టుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


ఇటీవల నిర్మల్ లో పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య


ఏ కష్టం వచ్చిందో ఓ వివాహిత తన పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన మానస(27) తన పిల్లలు ఐన కొడుకు బలాదిత్య(8) భవ్యశ్రీ (7) తో కలిసి బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గోదావరిలో నుండి మృతదేహాలను బయటకు తీసి పంచనామ నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద బందువుల రోదనలు అక్కడ ఉన్నవారి హృదయాలను కలచి వేశాయి. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.