Hyderabad Chaddi gang spotted in Miyapur: మియాపూర్: హైదరాబాద్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. గతంలో నగరంలోని ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడంతో హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరు నిందితులు శనివారం అర్ధరాత్రి మియాపూర్ లోని వరల్డ్ వన్ స్కూల్ లో చోరీ చేశారు. స్కూల్ కౌంటర్ లో ఉంచిన 7 లక్షల 85 వేల నగదును చెడ్డీ గ్యాంగ్ ముఠా దోచుకెళ్లింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.
ఒంటిమీద దుస్తులు లేకుండా ముఖానికి మాస్కులు ధరించి, కేవలం చెడ్డీలతో వచ్చిన దొంగలు స్కూల్ లో ఉంచిన నగదు దోపిడీ చేశారు. స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ను పోలీసులకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేస్తామన్నారు.