CUET UG 2024 Exam: దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" షెడ్యూలులో ఎలాంటి మార్పు ఉండదని యూజీసీ (UGC) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన మాదిరిగా మే 15 నుంచి 31 మధ్యే ఈ పరీక్షలు జరుగుతాయని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ మార్చి 17న తెలిపారు. సీయూఈటీ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోందని.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిశాక పూర్తివివరాలతో స్పష్టమైన పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీయూఈటీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు ఉండొచ్చంటూ గతంలో చెప్పిన విషయంపై ఆయన తాజాగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.






సీయూఈటీ - యూజీ పరీక్షలు ఎన్‌టీఏ గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే (మే 15 నుంచి 31 వరకు) జరుగుతాయని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లోని రెండు తేదీల్లో (మే 20, 25) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 26న సీయూఈటీ (యూజీ) దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత అసలు ఎంతమంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు? ప్రాంతాల వారీగా ఎంతమంది ఉన్నారనే డేటా, పరీక్ష తేదీల ఆధారంగా ఎన్‌టీఏ డేట్ షీట్‌ను రూపొందించి విడుదల చేస్తుందని యూజీసీ చీఫ్ పేర్కొన్నారు. గతేడాది 14.9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే.


"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' ఫిబ్రవరి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 15 నుంచి 31 మధ్య సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.  జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తారు. 


సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.


సీయూఈటీ దరఖాస్తు విధానం, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


ముఖ్యమైన తేదీలు..


➸ సీయూఈటీ  యూజీ -2024 నోటిఫికేషన్:  27.02.2024.


➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2024.


➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).


➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).


➸ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్: 28.03. 2024 - 29.03.2024 (రాత్రి 11:50 వరకు).


➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2024 నుంచి.


➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2024.


➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 15 నుండి మే 31, 2024 వరకు


➸ ఫలితాల ప్రకటన: 30.06.2024.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..