Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని మరో 28 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలు తీసుకొని దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. రూ.361.92 కోట్లు నామా నేరుగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
డొల్ల కంపెనీలకు మళ్లింపు
టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ వరుస షాక్ లు ఇస్తుంది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకుని దారి మళ్లించిన కేసులో ఇటీవల రూ.96 కోట్ల 21 లక్షల విలువైన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను జప్తు చేసింది. ఈ కంపెనీలన్నీ నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఉన్నట్టు ఈడీ పేర్కొంది. రాంచీ-జంషెడ్‌పూర్ హైవే పేరిట బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మధుకాన్ గ్రూప్ కంపెనీలు ఆ నగదు దారి మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆరు డొల్ల కంపెనీల ద్వారా నిధుల వేరే వాటికి మళ్లింపు జరిగిందని ఈడీ తెలిపింది. దీంతో హైదరాబాద్, బెంగాల్, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 88 కోట్ల 85 లక్షల విలువైన భూములు, మధుకాన్ షేర్లు సహా 7 కోట్ల 36 లక్షల చరాస్తులను ఇటీవల ఈటీ అటాచ్ చేసింది.
ఈడీ దాడులు
రాజకీయ వ్యూహంలోనే భాగంగా ఈడీ దాడులు, ఆస్తుల అటాచ్ అంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తు్న్నారు. బీజేపీతో సంబంధాలు క్షీణించిన తర్వాత టీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులు ఎక్కువయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీపై చేస్తున్న రాజకీయ యుద్ధం కారణంగా బీజేపీ సైలెంట్‌గా ఉండదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పార్టీకి ఆర్థికంగా అండదండగా ఉన్న వారిని పార్టీలో బడా పారిశ్రామికవేత్తల్ని పార్టీలో చేర్చుకోవాలి అనుకున్న వారిని బీజేపీ టార్గెట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీకి దర్యాప్తు సంస్థలు చేసే సాయం ఏమిటో బెంగాల్‌లో చూశామని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు ఏమీ లేని బీజేపీలో తృణమూల్ నేతలందరూ పోలోమని చేరడానికి కారణం దర్యాప్తు సంస్థలే. శారదా స్కాం అని మరొకటని టీఎంసీ నేతలపై కేసులు నమోదు చేశారు. దాడులతో భయపెట్టారు. వారంతా బీజేపీలో చేరితే ఆ కేసులు సైలెంట్ అయిపోయాయి. తెలంగాణలోనూ అదే జరుగుతుందని నమ్ముతున్నారు.
దర్యాప్తు సంస్థల దూకుడు
సీబీఐ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తేనే సీబీఐ విచారణ చేయాలి. కానీ ఐటీ, ఈడీకి అలాంటి పరిమితులు లేవు. టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు విషయంలో కూడా ఈడీనే ఆస్తులు జప్తు చేసింది. ఈడీ రాడార్‌లో చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా గుప్పు మంటోంది. ముఖ్యంగా భారీ వ్యాపారాలు ఉన్న వారిపై కన్నేసినట్లుగా చెబుతున్నారు. వారి ఆర్థిక వ్యవహారాల్లో ఏదో ఓ లోపం కనిపెట్టడం ఈడీకి పెద్ద కష్టం కాదు. అలాంటి వారిని ఇప్పటికే మార్క్ చేశారని సమయం చూసుని ఎటాక్ చేయడమే మిగిలిందని అంటున్నారు. ఇలాంటి సమాచారం ఉండబట్టే కొద్ది రోజులుగా బీజేపీ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్, కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి.