Electronics Mart IPO Shares: ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ (Electronics Mart India) IPO సబ్‌స్క్రైబర్లకు వారం ముందే దీపావళి ముందే వచ్చింది. ఈ కంపెనీ షేర్లు సూపర్ డూపర్ లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. ఇవాళ (సోమవారం) ఈ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. IPO ఇష్యూ ప్రైస్ 59 రూపాయలతో పోలిస్తే, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (NSE) ఈ షేర్లు 90 రూపాయల ధర వద్ద అరంగ్రేటం చేశాయి. ఒక్కో షేరు మీద 52.5 శాతం ప్రీమియం లేదా లిస్టింగ్ లాభం షేర్ హోల్డర్లకు దక్కింది.
ఒక్కో లాట్‌కు రూ.7,874 లాభం
రూపాయల లెక్కన చూస్తే, ఇన్వెస్టర్లకు అలాట్ అయిన ఒక్కో లాట్‌కు 7,874 రూపాయల లాభం వచ్చింది. IPOలో ఒక్కో లాట్‌కు 254 షేర్లను నిర్ణయించారు. ఇన్వెస్టర్లు 254 షేర్ల చొప్పున లాట్ల రూపంలో బిడ్స్ వేశారు. ఇష్యూ ధర 59 రూపాయలు. ఈ లెక్కన ఒక్కో లాట్‌కు అయిన పెట్టుబడి (59 x 254) 14,986 రూపాయలు. షేర్ లిస్టింగ్ తర్వాత ఒక్కో లాట్‌కు వచ్చిన మొత్తం (90 x 254) 22,860 రూపాయలు. లిస్టింగ్ గెయిన్స్ (22,860-14,986) 7,874 రూపాయలు. ఇలా.. ఒక IPO సబ్‌స్కైబర్ ఎన్ని లాట్లు దక్కించుకుంటే, అన్ని 7,874 రూపాయల లాభం ఇవాళ జేబులో వేసుకున్నట్లే.
హమ్మయ్య, ఒక హిట్
మార్కెట్‌లోని IPO సబ్‌స్కైబర్లందరూ ఈ రోజును తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే, గతేడాది తరహాలో ఈ ఏడాది IPOల జోరు లేదు. వచ్చిన పబ్లిక్ ఆఫర్లలో చాలా వరకు తుస్సుమన్నాయి, నష్టాలు మూటగట్టి ఇన్వెస్టర్ల నెత్తిన పెట్టాయి. ఎలక్ట్రానిక్స్ మార్ట్ లిస్టింగ్ గెయిన్స్‌ను అందించడంతో, భవిష్యత్ IPOల మీద ఆశలు, అంచనాలు పెరిగాయి. IPOలను ప్రారంభించడానికి సెబీ నుంచి తుది న్ని అనుమతి వచ్చినా, ప్రస్తు మార్కెట్ పరిస్థితులను చూసి ఇప్పటివరకు IPOలను ప్రారంభించని కంపెనీలకు కూడా ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా IPO ఆశాకిరణంగా కనిపించింది. ఈ జోరును అవకాశంగా మార్చుకోవడానికి మిగిలిన కంపెనీలు కూడా త్వరలో IPOలు ప్రారంభించే అవకాశం ఉంది.
ఆయా కంపెనీలకు కూడా
ఈ IPO ఈ నెల 4న ప్రారంభమై 7న ముగిసింది. ప్రైస్ రేంజ్‌ను రూ.56-59గా నిర్ణయించారు. గరిష్ట ధర వద్ద రూ.500 కోట్లను ఈ కంపెనీ సమీకరించింది. ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బులో రూ.55 కోట్లతో అప్పులు తీర్చనుంది. రూ.111 కోట్లను మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించుకుంటుంది.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అమ్మే స్టోర్లను బజాజ్ ఎలక్ట్రానిక్స్ (Bajaj Electronics) బ్రాండ్‌తో ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 112 ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.434.93 కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.