Hyderabad News :  హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపింది. రామ్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ రవిచారి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌ నుంచి చికెన్‌ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ బిర్యానీ తింటునప్పుడు అందులో బల్లిని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కంగారు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరికీ వాంతులు అయ్యారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులకు కార్పొరేటర్‌ ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు హోటల్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో రెండు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు బిర్యానీ నమూనాలు సేకరించి టెస్టింగ్ పంపారు. ఈ హోటల్‌ నిర్వాహకుడికి నోటీసులు ఇచ్చారు అధికారులు. నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, ఫలితాలు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 


కూల్ డ్రింక్ లో బల్లి


కూల్ డ్రింక్ లో బల్లి చనిపోయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఈ క్రమంలో భార్గవ జోషి అనే కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో గుజరాత్ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ రంగంలోకి దిగారు. పరీక్ష కోసం అవుట్‌లెట్ నుంచి కూల్ డ్రింక్స్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాల ఫలితాలు రాగానే అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సంఘటన తర్వాత శనివారం గుజరాత్ లోని సోలా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ను అధికారులు సీజ్ చేశారు. కస్టమర్ భార్గవ జోషి కొనుగోలు చేసిన కూల్ డ్రింక్ లో బల్లి ఉన్న వీడియోను శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్గవ జోషి అతని స్నేహితులు సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో వచ్చారు. అప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే అవుట్ లెట్ సిబ్బంది తమ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ. 300 వాపసు ఇచ్చినట్లు భార్గవ జోషి తెలిపారు. ఆ తర్వాత భార్గవ జోషి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జాతీయ మీడియా నివేదికల ప్రకారం అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ముందస్తు అనుమతి లేకుండా తమ మెక్ డొనాల్డ్ అవుట్ లెట్ ను నిర్వహిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై మెక్ డొనాల్డ్ సంస్థ స్పందించింది. తమ రెస్టారెంట్లలో 42 సెఫ్టీ చెక్ ప్రోటోకాల్ అమలుచేస్తున్నట్లు తెలిపింది.