Rangareddy News : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో విషాదం జరిగింది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బయటకు వెళ్లిన భర్త  ఇంటికి వచ్చే లోపు తనువు చాలించింది. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని భార్య ఆత్మహత్యకు పాల్పడిందని భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 8 నెలల క్రితం అత్తాపూర్ కు చెందిన కిరణ్ కుమార్ తో పుష్పాంజలి వివాహం జరిగింది. 


విషాదాంతమైన ప్రేమ కథ 


కుటుంబ పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కలిసి జీవించే అవకాశం లేదని కలిసి మరణించాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన ప్రేమ జంట అనిత, మణికుమార్‌ కర్ణాటకలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కందనాతి గ్రామానికి చెందిన కేశవ్‌ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా కృష్ణా మండలం చేగుంటకు వలస వచ్చారు. కొంతకాలంగా వారి దగ్గరే ఉంటున్న కేశవ్‌ చిన్నమ్మ కుమారుడు మణికుమార్‌ కూడా వారితో పాటు వలస వెళ్లాడు. కేశవ్‌ కూతురు అనిత, మణికుమార్‌ మధ్య ప్రేమ చిగురించింది. వరుసలు కలువవని వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన మణికుమార్‌, అనిత  కృష్ణా మండలం చేగుంట రైల్వే స్టేషన్‌ సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో రైలు కిందపడి సూసైండ్ చేసుకున్నారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలపించారు. మృతదేహాలను వారి సొంత గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


 దంపతుల ఆత్మహత్య
 
కడప జిల్లా మైలవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని మైలవరం కట్టమీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికులు తెలిపారు. మృతులు దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గోవర్ధన్ అని పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు  బంధువులు చెబుతున్నారు. లక్ష్మీదేవి మృతదేహం దొరకగా గోవర్ధన్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులకు ఒక పాప, బాబు ఉన్నట్లు తెలుస్తోంది. 


జడ్పీటీసీ దారుణ హత్య


సిద్దిపేట జిల్లాలో ఓ జడ్పీటీసీ మెంబర్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన సందర్భంలో ఆయనపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో జరిగింది. చేర్యాల జెడ్పీటీసీ మెంబర్ అయిన శెట్టె మల్లేశం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం (డిసెంబర్ 26) ఉదయం దాడికి పాల్పడ్డారు. వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఆయన్ని స్థానికులు మొదట సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే మల్లేశం మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.