Hyderabad IPL Betting: హైదరాబాద్ లో ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.36,14,918 లను స్వాధీనం చేసుకున్నట్లుగా సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ టీమ్ పోలీసులు వెల్లడించారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారు అనే సమాచారంపై రామచంద్రాపురం ప్రాంతంలో రామకృష్ణా గౌడ్, ఉపేందర్ గౌడ్ అనే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా.. వారు NICE7777 అనే APP ద్వారా తెలిసిన పంటర్స్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.
వారి మొబైల్ ఫోన్ లోని యాప్ పరిశీలించగా మొత్తం 42 పంటర్స్ వివరాలను పోలీసులు గుర్తించారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు కనెక్ట్ అయిన 5 బ్యాంక్ అకౌంట్స్ లలో ఉన్న మరో రూ.18,40,997 సొమ్మును పోలీసులు ఫ్రీజ్ చేశారు.
బుకీ ల వివరాలు
1. మొగిలిగిడ రామక్రిష్ణ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 30, బీరంగూడ (బుకీ)
2. మొగిలిగిడ ఉపేందర్ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 40, బీరంగూడ (బుకీ)
3. సోను (మెయిన్ బుకీ - పరారీ)
4. తలారీ శ్రీనివాస్, S/o హన్మంతు, వయసు 38, గాజుల రామారం (పంటర్)
5. బండి వినయ్ కుమార్, గాజుల రామారం (పంటర్)
ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బులు విత్ డ్రా
మరో ఘటనలో ATM కార్డు మోసం వెలుగు చూసింది. కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి రూ.1.73 లక్షలు కాజేశాడో కేటుగాడు. ఈ ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటీ పుణ్యవతి జనవరి 27వ తేదీన మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి అక్కడే ఉన్న ఓ యువకుడికి తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇవ్వాలని కోరగా అతడు రూ.4 వేలు డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం ఇచ్చాడు.
దీంతో తస్కరించిన ఏటీఎం కార్డుతో విడతల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న రూ.1.73 లక్షలను కాజేశాడు. కాగా గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా కోసం ప్రయత్నించగా.. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి నేడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న సెబ్ పోలీసులు
కడప జిల్లాకు తరలిస్తున్న భారీ అక్రమ మద్యాన్ని కర్నూలు ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బాక్సుల 11,520 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని ఎస్ఈబీ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. సీజ్ చేసిన మద్యం విలువ 14 లక్షల 51 వేలు అని, సీజ్ చేసిన వాహనం ధర 4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మద్యాన్ని కడప జిల్లాకు చెందిన రింగుల భాష అనే వ్యక్తి కీలక సూత్రధారని తెలిపారు. ఇతనిపై ఇప్పటికే వందకు పైగా అక్రమ మద్యం, ఎర్రచందనం తరలింపు కేసులు ఉన్నాయని తెలిపారు.