Hyderabad Crime News: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఐస్ క్రీం అంటే ఇష్ట పడని వాళ్లు ఉండరు. అసలే ఎండాకాలం.. అందులోనూ చల్ల చల్లని ఐస్ క్రీం తింటే బాగుంటుందని చాలా మంది అనుకుంటుంటారు. రోజుకొకటి తింటూ ఆనంద పడిపోతుంటారు. అందులోనూ చిన్న పిల్లలు అయితే మరింత ఎక్కువగా తింటుంటారు. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాల్లో అయితే నేరుగా రోడ్లపై తిరుగుతూ ఐస్ క్రీములు అమ్ముతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లనే లక్ష్యంగా చేసుకొని పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతులు లేకుండానే ఐస్ క్రీములు తయారు చేస్తున్నారు. వాటికి బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు అతికిస్తూ అందరినీ మోసం చేస్తున్నారు.


పది రూపాయలు ఎక్కువైనా సరే మంచిదే కొనాలని చూసిన తల్లిదండ్రులు.. ఈ ఫేక్ లేబుళ్లను చూసి మోసపోతున్నారు. అయితే ఇలా అక్రమంగా ఐస్ క్రీములు తయారు చేస్తున్న ఓ కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. 




అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ లోని చందానగర్ లో శ్రీనివాస్ రెడ్డి అనే ఓ వ్యక్తి  అక్రమంగా ఐదేళ్ల నుంచి ఐస్ క్రీములు తయారు చేస్తున్నాడు. నాసిరకనమైన ఐస్ క్రీములు తయారు చేస్తూ.. వాటికి బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లను అతికిస్తూ.. విక్రయాలు చేస్తున్నాడు. బాగా డబ్బులు సంపాధించుకుంటున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు సదరు కంపెనీపై దాడి చేశారు. ఎలాంటి అనమతులు లేకుండానే శ్రీనివాస రెడ్డి ఐస్ క్రీములు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం గోదాం మొత్తం తనిఖీలు చేయగా.. పది లక్షల రూపాయల విలువ చేసే ముడి పదార్థాలు, సరుకులు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


ఇటీవలే అత్తాపూర్ లో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రంపై దాడి


హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అత్తాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల  మధ్యనే అక్రమంగా చాక్లెట్ల పరిశ్రమ దందాను కొందరు మొదలుపెట్టారు. అంతే కాదండోయ్ మాదకర రసాయన పదార్థాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకంతోనే వాటిని తయారు చేస్తున్నారు. అలాగే వాటిని నేరుగా తీసుకెళ్లి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న తయారీ కేంద్రంపై దాడులు జరిపారు. డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకాన్ని పారబోశారు. అయితే నిందితులు తప్పించుకున్నారు. 


ఇలాంటి ప్రమాదకర రసాయనాలతో తయారు చేసే ఐస్ క్రీములు, చాక్లెట్లు, లాలీ పప్స్ అందరికీ అనేక అనారోగ్య సమస్యలను తెస్తాయి. చిన్నారుల ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలయినంత వరకు ఇలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి.