Srikakulam Crime News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్. గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు రికార్డు ఉంది.
శ్రీకాకుళం జిల్లా బుడమూరు నాగరాజు అనే వ్యక్తి మరోసారి మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పి వివిధ సంస్థల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు కేసు నమోదు అయింది. ఈ మేరకు గురువారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్‌డీని అని చెప్పుకొని వివిధ సంస్థల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు.
ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ అయిన నాగరాజుది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట. ఇలా ప్రముఖుల పేర్లు చెప్పుకొని ఈజీగా డబ్బులు సంపాదించే మోసాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. గతంలో ఇలాంటి కేసుల్లోనే ఇరుక్కున్నాడు. అయినా తన బుద్ది మార్చుకోలేదు. మళ్లీ అలాంటి ప్రయత్నం చేసి అరెస్టు అయ్యాడు.
ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పి వసూళ్లకు ప్రయత్నించాడు. రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ పేరుతో ఫేక్ మెయిల్ ఐడీలు, ఇతర గుర్తింపు కార్డులు సృష్టించి వివిధ సంస్థలను బెదిరించాడు. వ్యాపారులకు ఫోన్‌లు చేసి వసూళ్ల దందా మొదలు పెట్టాడు. కొందరు వ్యాపారులు ఆరా తీస్తే ఇదంతా ఫేక్ అని తెలిసింది. దీంతో విషయాన్ని సీఎంవో అధికారులకు చేరవేశారు.
ముఖ్యమంత్రి పేరుతో దందా చేస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజుపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అతని వద్ద ఉన్న ఫోన్, ఇతర గాడ్జెట్స్‌ను సీజ్ చేశారు.
నాగరాజు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. 2020లో ప్రముఖల పేర్లు చెప్పుకొని వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసేందుకు యత్నించాడు. అప్పుడు కూడా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం అతనిపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒకటికాదు రెండు కాదు పదిహేనుకుపైగా కేసుల్లో ఇతని ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు.