Afzal Gunj Police Arrests Ganja Gang: తెలుగు రాష్ట్రాల పోలీసులు, ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్న సమస్య గంజాయి స్మగ్లింగ్, కల్తీ మద్యం, కల్తీ సారా. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా, హెచ్చరించినా కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. ఏదో విధంగా గంజాయి, మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. కేటుగాళ్లు ఎన్ని జిత్తులు పారించినా, పోలీసులకు ఏదో సమయంలో దొరికిపోవడం, ఆపై పూర్తి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులోనే గంజాయి హైదరాబాద్ తీసుకొచ్చిన గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
భద్రాచలం టు హైదరాబాద్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తోంది ఈ గ్యాంగ్. ఆపై నగరంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు నిందితులను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాకు వినియోగించిన మారుతి కారు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ .1 లక్ష విలువ ఉంటుందని తెలుస్తోంది.
అధిక సంపాదన కోసం అడ్డదారులు..
పోలీసుల తెలిపిన వివరాలు ఇలా.. ననత్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం( 43 ) తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. భద్రాచలానికి చెందిన కొర్ర శశి ( 30 ), కుల్దీప్ మణి ( 35 ) , రోహిలా ( 45 ), ఖయ్యుం ( 40 )లతో ముఠాగా ఏర్పడ్డాడు. గత కొంతకాలం నుంచి గంజాయిని భద్రాచలంలోని వివిధ ప్రాంతాల నుంచి 2 కేజీలకు రూ.6 వేల చొప్పున ప్యాకెట్లను తయారు చేసి నగరంలో తెలిసిన వ్యక్తులకు రూ .12 వేలకు విక్రయిస్తున్నారు. కాగా సోమవారం సయ్యద్ సలీం, కొర్ర శశి, కుల్దీప్ మణిలు గంజాయిని ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి ఎంజీబీఎస్ బస్టాండ్‌లో దిగారు.
గంజాయి స్మగ్లింగ్‌పై సమాచారం ఉన్న పోలీసులు వారిని తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగరంలో గంజాయి సరఫరాకు వాడిన అద్దె కారు, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రోహిలా, ఖయ్యుంలను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు .
Also Read: Secunderabad: సికింద్రాబాద్‌లో అతి భారీ అగ్ని ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం - రంగంలోకి 8 ఫైరింజన్లు
Also Read: Weather Updates: నేడు తీరం దాటనున్న అసని తుఫాన్ - అక్కడ ఈదురు గాలులు, భారీ వర్షాలు: ఐఎండీ