Hyderabad: ఆన్ లైన్ డేటింగ్ ఆప్స్... ఈ మధ్య చాలా మంది ఇలాంటి వాటిని వాడుతూ తమకు నచ్చిన వాళ్లతో రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. ఛాటింగ్ లు, మీటింగులు అంటూ కాఫీ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. విషయం గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఇదే పంథాలో యువకులను మోసం చేస్తున్నారు. నకిలీ డేటింగ్ యాప్స్ ను క్రియేట్ చేసి అమ్మాయిలుగా చెప్పుకొని చాట్ చేస్తూ కోట్లలో దోచేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్ లో జరిగింది. అయితే వ్యాపారి బలహీనతను ఆసరాగా చేసుకొని కోటి 50 లక్షలు దేచేశాడో సైబర్ నేరగాడు. అయితే ఇది ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దశల వారీగా కోటి 50 లక్షలు..
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్కార్ట్ సర్వీస్, కాల్ బాయ్ డేటింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ప్రొఫైల్స్ అన్నీ చూసి ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడు. అయితే అటువైపు నుంచి రిప్లై రావడంతో వ్యాపారి ఛాటింగ్ మొదలు పెట్టాడు. నీకు నా నుంచి ఎలాంటి సేవలు కావాలన్నా డబ్బులు చెల్లించాలని అమ్మాయి0 చెప్పడంతో.. ముందుగా 10 లక్షలు, ఆ తర్వాత 15 లక్షలు ఆమె చెప్పిన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. అప్పటికే అతనికి అనుమానం రావడంతో.. ఆ అమ్మాయ మరో 25 లక్షలు పంపిస్తే నీ దగ్గరకు వస్తానని నమ్మబలికింది. దీంతో వ్యాపారి మరో 25 లక్షలు పంపించాడు. ఇలాగే విడతల వారీగా మొత్తం కోటి 50 లక్షలు అమ్మాయికి పంపాడు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
డిల్లీలో ఉంటూనే డేటింగ్ యాప్స్ పేరిట మోసాలు..
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిల్లీలో ఉంటున్న అరుణ్ అనే వ్యక్తి డేటింగ్ యాప్స్ పేరిట యువతను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినాని యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు గురవుతోంది. కేవలం యువకులే కాకుండా వయసు పైబడిన వాళ్లు కూడా ఈ డేటింగ్ యాప్స్ ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకోవడం గమనార్హం.
పరువు పోతుందేమోనన్న భయంతో ముందుకురాని బాధితులు..
సాధారణంగా చిన్న మొత్తం మోసపోయిన వారెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదని పోలీసులు చెబుతున్నారు. పరువు పోతుందన్న భయంతో గప్ చుప్ గా ఉండిపోతున్నారని అన్నారు. టీనేజీ కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని డేటింగ్ యాప్స్ ముసుగులో కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. అలాగే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని తెలిపారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఇలాంటి మోసాలను అడ్డుకోగలం అని తెలిపారు. ముఖ్యంగా యువత ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.