ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన కార్మికులను మోసం చేస్తున్న ఓ గ్యాంగ్‌ను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీలో కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు, ఆటో డ్రైవర్లు కుమ్మక్కై ఓ గ్యాంగ్‌గా ఏర్పడి అమాయకులను దోచుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. అలాంటి ఓ గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్టు జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. 

బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఈ గ్యాంగ్ టార్గెట్‌ చేసుకుంటుంది. సిటీ రూట్ తెలియని వాళ్ళను ఆటోలో ఎక్కించుకొని దారి చూపిస్తామని చెప్పి మోసం చేస్తారు. వారిని సిటీ మొత్తం తిప్పి వారి వద్ద ఉన్న డబ్బులను దోచుకుంటారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కార్మికులు గతనెల 29న న కరీంనగర్‌లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని కోసం వచ్చారు. మధ్యప్రదేశ్‌ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌ గురించి తెలియని వీళ్లంతా ఎంజీబీఎస్‌ అనుకొని ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి 12 గంటలు కావడంతో దారి చెప్పేవాల్లెవరూ లేకపోయారు. 

సరిగ్గా ఆ సమయంలో రెండు ఆటోల్లో వచ్చిన కొందరు వ్యక్తులు వీళ్ల పరిస్థితి గమనించారు. విషయం పూర్తిగా అర్థం చేసుకున్నారు. కరీంనగర్‌కు తాము టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పక్కన ట్రావెల్స్ ఏజెన్సీ ఉందంటూ మాయమాటలతో నమ్మించారు. సుమారు రెండు మూడు గంటలు సిటీలో తిప్పారు. 

అలా తిప్పుతూ మళ్ళీ వారిని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సలాం నమస్తే ట్రావెల్స్ వద్ద దింపారు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, నెగిటివ్ సర్టిఫికెట్ లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టారు. సలాం నమస్తే ట్రావెల్ ఏజెన్సీ ఇలాంటి సమస్యల్లేకండా గమ్యస్థానానికి చేరుస్తారని నమ్మించారు. అక్కడే వారిని నిర్బంధించి వారి వద్ద ఉన్న డబ్బు లాక్కున్నారు. తర్వాత ఆ కార్మికులను తీసుకుని వెళ్లి ఆరాంగర్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఈ ఘటన తరువాత పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జాయిగ్ సిపి విశ్వ ప్రసాద్ తెలిపారు. కార్మికులు ప్రయాణించిన ట్రావెల్ ఏజెన్సీని, ఆటో డ్రైవర్లను విచారించామన్నారు. దాని ఆధారంగా ఎనిమిది మంది నేరస్తులను అరెస్ట్ చేసామని ఆయన తెలిపారు. వీరిపై 395 డెకాయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. 

నగరంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మరికొన్ని ముఠాలను గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఇలాంటి ముఠాలు కంటపడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.