Centre on Cryptocurrency: హమ్మయ్యా.. క్రిప్టో కరెన్సీపై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. అందుకే 30 శాతం పన్ను వేస్తారట!

ABP Desam Updated at: 02 Feb 2022 06:27 PM (IST)
Edited By: Murali Krishna

క్రిప్టో కరెన్సీలపై పన్ను ఎలా వేస్తారని అందరూ అడుగుతోన్న ప్రశ్నలకు ప్రభుత్వం నేడు సమాధానం చెప్పింది. క్రిప్టో కరెన్సీ ఎప్పటిికీ చట్టబద్ధం కాదని.. కానీ ఆ లావాదేవీలపై పన్ను వేసే హక్కు ఉందని తేల్చింది.

క్రిప్టో కరెన్సీ

NEXT PREV

డిజిటల్‌ అసెట్స్‌పై వచ్చే ఆదాయంపై పన్ను వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్డెట్ ప్రసంగంలో ప్రకటించారు. వర్చువల్‌ అసెట్స్‌ను బహుమతిగా బదిలీ చేసినప్పటికీ స్వీకర్త పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. అసలు క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్‌ ఎలా విధిస్తుంది? అన్నది చాలా మందికి వచ్చిన ప్రశ్న. అయితే దీనిపై ఆర్థిక కార్యదర్శి నేడు స్పష్టత ఇచ్చారు. 



క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత లావాదేవీల.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం. ప్రముఖ క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్, ఎథెరియమ్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ).. ఎప్పటికీ చట్టబద్ధం కాలేవు. వీటికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వదు. ఎందుకంటే వీటి విలువను ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయిస్తారు. కనుక ఎప్పటికీ ఇవి చట్టబద్ధం కావు. మీరు బంగారం, డైమండ్, క్రిప్టో ఏదైనా కొనుక్కోండి.. కానీ వీటి విలువను ప్రభుత్వం నిర్ణయించదు. అసలు క్రిప్టోలపై మీరు పెట్టిన పెట్టుబడులు విజయవంతమయ్యాయో లేదో కూడా గ్యారెంటీ ఉండదు. పెట్టుబడి పెడితే మీరు నష్టపోవచ్చు కూడా.. దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు.                               -   సోమనాథన్‌, ఆర్థిక కార్యదర్శి  


అలాగే దీనిపై..


జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో లావాదేవీలపై పన్నుల వసూలు ఉండబోతుందని సోమనాథన్‌ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనున్నట్లు తేల్చారు. 


దీనికి హామీ ఉంది..


మరోవైపు ప్రభుత్వం తీసుకురాబోతున్న డిజిటల్ రుపీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమన్నారు.



ఈ డిజిటల్ కరెన్సీని ఆర్‌బీఐ తీసుకువస్తుంది. కనుక ఇందులో ఎలాంటి మోసం లేదు. ఇదీ ఓ కరెన్సీలానే కానీ డిజిటల్ రూపంలో ఉంటుంది అంతే. ఇది చట్టబద్ధం. మిగిలినవి ఏవీ కాదు.                                                      -  సోమనాథన్, ఆర్థిక కార్యదర్శి


క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్‌, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్‌ మోత మోగించడం వల్ల క్రిప్టో కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది.


Published at: 02 Feb 2022 06:04 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.