ఆర్గానిక్‌, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు బడ్జెట్‌ 2022లో కేంద్రం స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా దేశంలోని అగ్రికల్చర్‌ యూనివర్శిటీని అప్‌గ్రేడ్ చేయబోతున్నట్టు నిర్మలాసీతారామన్‌ తన బడ్జెట్ స్పీచ్‌లో తెలియజేశారు. సిలబస్‌లో మార్పులు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. 


జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ భావనను ప్రోత్సహించడం ప్రారంభించిన కేంద్రం...
వ్యవసాయంలో  నిలకడైన అభివృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి, మార్కెట్ యాక్సెస్ వృద్ధి చేయడానికి ఇది పని చేస్తోంది. 


2021 డిసెంబర్ 16న ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...రైతు స్థితిగతులను మెరుగుపరచడానికి  నేచురల్‌ ఫార్మింగ్‌ ఆశాజనక సాధనమన్నారు.







ఐకార్‌ అపెక్స్‌ బాడీ కూడా నేచురల్ ఫార్మింగ్‌ ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లోని యూనివర్శిటీలు నేచురల్‌ ఫార్మింగ్ ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సర్క్యులర్‌ జారీ చేసింది. 


నేచురల్‌, జీరో బడ్జెట్,  సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయానికి విలువలు జోడించి నిర్వహణ అవసరాలను తీర్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌ సవరించాలి. దీని కోసం రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చెప్పారు. 


ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారభించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ ప్రారంబించబోతున్నారు. 


పంట మార్పిడి సాగుకు అధిక ప్రాధాన్యాత ఇస్తూ.. ఒకే విధమైన పంటలు వేసే విధానాలకు స్వస్తి చెప్పేలా రైతులను ప్రోత్సహించడమే జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌.  ఆవు పేడ, మూత్రంతో బీజామృతం, జీవామృతం, ఘంజీవామృతం వంటి సేంద్రీయ ఎరువుల తయారు చేస్తారు. 


బయోమాస్‌తో మట్టిని కప్పడం లేదా మట్టిని ఏడాది పొడవునా గ్రీన్‌ కవర్లతో కప్పి ఉంచడం వంటి సాంప్రదాయ పద్ధతులు, నీళ్లు లేకపోయినా స్థిరమైన దిగుబడి వచ్చేలా చేయడం నేచురల్‌ ఫార్మింగ్.