Hyderabad News: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ పోలీసే నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడానికి కారణం అయ్యారు. పూటుగా మద్యం సేవించిన ఓ సీఐ.. కారు నడుపుకుంటూ వెళ్లి ఓ కూరగాయల వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న వాహనంలోని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 


బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ సీఐ శ్రీనివాస్ తప్ప తాగి కారు నడిపారు. నడపడమే కాకుండా కూరగాయల వాహనాన్ని ఢీ కొట్టారు. రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న వాహనంలోని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఐగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ వేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం డీఎస్పీ ప్రమోషన్ లో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారు వ్యాన్ లను బొల్లారం పీఎస్ కు తరలించారు.


రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..!


డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు
ఇది భారతదేశంలో చాలా తీవ్రమైన సమస్య. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటూ, ఖరీదైన జరిమానాలు విధిస్తున్నా, వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి.


డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు
కారు అయినా, బైక్ అయినా చాలా మంది ఈ అజాగ్రత్తతో కనిపిస్తుంటారు. రైడర్ లేదా డ్రైవర్ దృష్టి రోడ్డుపైనే ఉండాలి. తద్వారా ప్రమాదం లాంటి పరిస్థితి తలెత్తదు. కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది.


హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపకూడదు
భారతదేశంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం కూడా తీవ్రమైన తప్పు. హెల్మెట్ ఉపయోగించడం ద్వారా రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా తలకు గాయం అయినప్పుడు కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అయినప్పటికీ చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చూడవచ్చు.


ఆకస్మిక లేన్ మారకూడదు
ద్విచక్ర వాహనమైనా, నాలుగు చక్రాల వాహనమైనా అన్ని వాహనాల్లో సూచికలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు తమ కారును రోడ్డుపై నడుపుతున్నప్పుడు కుడి వైపు లేదా ఎడమవైపు ఒకేసారి తిప్పుతారు. కొన్నిసార్లు ఎడమ వైపు నుంచి ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తారు. ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది.


ఓవర్‌లోడింగ్ చేయకూడదు
చిన్న వ్యాపారం చేసే చాలా మంది వ్యక్తులు తమ బైక్ లేదా స్కూటర్ ద్వారా వస్తువులను తీసుకువెళతారు. ఇందులో గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు కూడా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై అధిక లోడ్ కారణంగా దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది.