Hyderabad Murder Case: హైదరాబాద్ లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు.. వ్యాపారి గొంతును కోసేశారు. పదునైన ఆయుధంతో అర్ధరాత్రి దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
28 ఏళ్ల నదీమ్ తాహే రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే ఇతడు నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన వాడు. సోదరి భర్త ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతడి తల్లిదండ్రులు టోలిచౌక్ లోని వారి నివాసానికి వచ్చి ఉంటున్నారు. ఈక్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడి సోదరుడుతో పాటు నదీమ్ కూడా సోదరి ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి టీ తాగేందుకు స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేశాురు. ఫోన్ ఎత్తిన నదీమ్ తాహే.. ఓ దాబాలో భోజనం చేస్తున్నాను, త్వరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అలా చెప్పి చాలా సమయం గడుస్తున్నా నదీమ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మరోసారి ఫోన్ చేశారు. అయితే నదీమ్ మాత్రం ఫోన్ లేపలేదు. ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు.
ఈరోజు ఉదయం అబ్దుల్ నదీమ్ హత్యకు గురయ్యాడంటూ... పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రాత్రి తమతో చక్కగా మాట్లాడిన కుమారుడిని ఇంత దారుణంగా హత్య చేయడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య
విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన 20ఏళ్ల సాయి.. హైదరాబాద్‌లో ఉంటున్నాడు. యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఓ యువతితో పరిచయం అయ్యింది. ఆమె జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు సాయి ప్రవర్తన నచ్చక ఆమె దూరం పెట్టింది. ఆ తర్వాత ఆమెకు మహబూబాబాద్ జిల్లా సంకిస గ్రామానికి చెందిన 18ఏళ్ల కార్తీక్ దగ్గరయ్యాడు. కార్తీక్.. హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. యూసుఫ్‌గూడలోని కార్తీక్ సోదరుడు శంకర్ ఉంటున్న గదికి వెళ్లి... మూడు రోజులు అక్కడే గడిపారు. ఈ విషయం తెలిసి సాయి తట్టుకోలేకపోయాడు. అందుకే కార్తీక్ హత్యకు ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో తేలింది.
విజయనగరం జిల్లాకు చెందిన సురేష్, రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్... సాయి స్నేహితులు. ముగ్గురు స్నేహితుల సాయంతో కార్తీక్ హత్యకు ప్లాన్ చేశాడు సాయి. గత నెల 13న రెండు బైక్‌లపై కార్తీక్ గదికి వెళ్లారు. యువతి దుస్తులు కొన్ని తమ గదిలోనే ఉండిపోయాయని.. వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు. నిజమే అని నమ్మిన కార్తీక్... వారితో కలిసి బైక్‌పై వెళ్లాడు. ఓల్డ్ బోయిన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ దగ్గర అటవీప్రాంతం వైపు కార్తీక్‌ను తీసుకెళ్లారు సాయి, అతని ఫ్రెండ్స్. అక్కడ కార్తీక్‌పై దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కత్తితో పక్కటెముకల్లో పొడిచేశారు. కత్తి వంకర పోవడంతో.. బాధితుడిని కిందపడేసి పీకకోసేశారు. బండరాయితో తల బద్దలుకొట్టారు. చనిపోయాడని నిర్ధరించుకున్నాక సాయి, అతని ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్తీక్ చంపేసిన తర్వాత ముగ్గురు నిందితులు సొంతూళ్లకు వెళ్లిపోగా.. సాయి మాత్రం మృతుడి హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు.
గతనెల 13 నుంచి కార్తీక్ కనిపించకపోయే సరికి... అతని సోదరుడు శంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. సీసీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. ఎంక్వైరీ చేసి... సాయి, అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో.. కార్తీక్ హత్య బయటపడింది. నలుగురూ కలిసి కార్తీక్‌ను చంపేసినట్టు విచారణలో అంగీకరించారు. ఈ హత్యలో యువతి ప్రమేయం ఏమైనా ఉందా..? అనే కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు.