Hyderabad News : చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబ విభేదాలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. కరణం అంబికా కృష్ణ అనే మహిళ తాను కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న కుమార్తెను అని, తనపై కరణం బలరాం కుమారుడు హత్యాయత్నం చేశారని పోలీసులను ఆశ్రయించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలో చేరారు. కరణం బలరాంకు వెంకటేష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే తాజాగా కాట్రగడ్డ ప్రసన్న, కరణం బలరాం తన తల్లిదండ్రులని, తనపై వెంకటేష్ హత్యాయత్నం చేశారని ఓ మహిళ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, కరణం బలరాం లకు ఓ ఆడపిల్ల జన్మించిందని గతంలో ప్రచారం జరిగింది. కానీ వారిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు.
పోలీసులకు ఫిర్యాదు
కరణం అంబికా కృష్ణ హైదరాబాద్ బల్కంపేటలో ఉంటున్నారు. కరణం అంబికాకృష్ణ ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. అతడిని పట్టుకుని ఆరా తీస్తే అతడిది ప్రకాశం జిల్లా అని తేలిందని, అతడు కరణం వెంకటేష్ ముఖ్య అనుచరుడికి దగ్గర వ్యక్తి అన్న సమాచారం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని కరణం అంబికా కృష్ణ తెలిపారు. తన తండ్రి కరణం బలరాం అని, సోదరుడు కరణం వెంకటేష్‌తో తనకు వివాదాలున్నాయని అంబికా కృష్ణ తెలిపారు. వెంకటేష్ తన అనుచరులతో దాడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించరు. తాజాగా దుండగుడు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంబికా కృష్ణ. కరణం వెంకటేష్ కు తనకు ఉన్న విభేదాలతో గతంలో పలుమార్లు హత్యాయత్నం చేశారని ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని అంబికా కృష్ణ తెలిపారు. కరణం వెంకటేష్ అనుచరుడు త్రివేది పై చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు నమోదు కాకుండా చేశారన్నారు. తాను గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంటానని, తరచూ పొన్నూరు–హైదరాబాద్ ప్రయాణిస్తూ ఉంటానని ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయాందోళనకు గురవుతున్నట్లు అంబికా కృష్ణ ఆదోళన వ్యక్తం చేశారు. కరణం వెంకటేష్ అతని అనుచరుడైన త్రివేది తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి పట్టుబడ్డ అగంతకుడు, వెంకటేష్ అనుచరుడు త్రివేదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కరణం బలరాం, ఆయన కుమారుడు ఇంకా స్పందించలేదు.
ఆగంతకుడు హల్ చల్
"నేను కరుణం అంబికా కృష్ణ, బల్కంపేటలో నివాసం ఉంటున్నాను. కరణం బలరాం, కాట్రగడ్డ ప్రసన్న కుమార్తెను. శనివారం రాత్రి 11:15 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి నా ఇంటిలోకి ప్రవేశించి నన్ను నా కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన వీడియోలన్నీ సీసీ కెమెరాలు నమోదు అయ్యాయి. నేను, నా ఇంటిలో ఉండేవాళ్లు తక్షణమే స్పందించి అతని పట్టుకుని ప్రశ్నించగా అతను ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన చంద్రశేఖర్ గా తెలిపాడు. తాగిన మత్తులో ఉన్నట్లుగా యాక్షన్ చేసి దొంగతనానికి వచ్చినట్లుగా చిత్రీకరించాడు. కానీ ఇది కచ్చితంగా నన్ను నా కుటుంబాన్ని హత్య చేయడానికి వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. దీనికి కారణం కరణం వెంకటేష్ కు నాకు మధ్య ఉన్న విభేదాలు వల్ల నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం. ఈ విషయంపై ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. ఈ ఘటనపై ఎటువంటి స్పందన ఎస్పీ కార్యాలయం నుంచి మాకు రాలేదు. కరణం వెంకటేష్ అనుచరుడైన త్రివేది పైనా చీరాల డీఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశాం. కరణం వెంకటేష్ అతని అనుచరుడైన త్రివేది నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాకు పూర్తిగా అనుమానంగాఉంది." అని అంబికా కృష్ణ ఫిర్యాదు చేశారు.