Audio Leak: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఒకటి అయ్యాక మరొకటి వెలుగుచూస్తోంది. ప్రజాప్రతినిధుల వాయిస్, వారి పేర్లతో వస్తున్న ఆ ఆడియోలు రాష్ట్ర రాజకీయాన్ని నిత్యం వాడివేడిగా ఉండేలా చేస్తున్నాయి. వీటి వల్ల అన్ని పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా మరో ఆడియో హల్ చల్ చేస్తోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఆడియో 2 నిమిషాలకు పైగా ఉంది. తాజాగా సర్క్యూలేట్ అవుతున్న ఆడియో లవ్యూ బంగారం ఎప్పుడూ నిద్రేనా అంటూ స్టార్ట్ అవుతోంది. అయితే గతంలోనూ అవంతి శ్రీనివాస్ పేరుతో ఇలాంటి ఆడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మాజీ మంత్రి స్పందిస్తూ తనకు ఆ ఆడియోకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. 


టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లో ఆడియాలో లీక్ వ్యవహారంపై స్పందించారు. గతంలో అవంతి శ్రీనివాస్ పేరుతో బయట పడిన ఆడియో గురించి కూడా అందులో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. విశాఖపట్నాన్ని రాజధానికా ప్రకటించిన తర్వాత అవంతి శ్రీనివాస్ రాసలీలలు ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందా అని ప్రశ్నించారు. పదవి పోయాకా పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చిందా అని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించడం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నిలదీసే ధైర్యం లేని.. మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్వీట్టర్ లో ప్రశ్నించారు. 


గతంలో ఆడియో లీక్ వ్యవహారంపై అవంతి శ్రీనివాస్ ఘాటుగానే స్పందించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, మరి తనపై ఇలా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారో తెలియటం లేదని చెప్పారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని కొంత మంది చూస్తున్నారని అన్నారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆ దేవుడే అన్ని చూసుకుంటాడని పేర్కొన్నారు. పార్టీలో కూడా తన ప్రతిష్ఠ దెబ్బ తీయాలని ఎవరో ప్రయత్నం చేసినట్టు అర్థం అవుతుందని అన్నారు. ఆ ఆడియో లీక్ పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అప్పుడు అవంతి కోరారు. ఆడియోలో నిజానిజాలు అన్నీ పోలీస్ వారే చెప్తారని అప్పుడు అన్నారు. తనపై కుట్రలో భాగంగానే ఆడియో లీక్ వ్యవహారాలు తనకు అంటగడుతున్నారని ఆరోపించారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని అని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, తన రాజకీయ ఎదుగుదల చూసి తట్టుకోలేక పోతున్నారని అన్నారు.