Meerpet Murder News: హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో (Meerpet Murder Case) ప్రియుణ్ని ఓ మహిళ ఫేస్ బుక్ ఫ్రెండ్‌తో కలిసి హత్య చేయించిన కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ముగ్గురు నిందితుల్ని పోలీసులు బుధవారమే అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మీర్ పేట్ ప్రశాంతి హిల్స్ కు (Prashanthi Hills) చెందిన శ్వేతా రెడ్డి అనే 32 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఆమెకు బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌తో 2015లోనే పెళ్లి జరిగింది. సోషల్ మీడియాతో కొంత కాలం క్రితం ఆమెకు బాగ్ అంబర్ పేట్ కు చెందిన యశ్మ కుమార్ అనే యువకుడు శ్వేతా రెడ్డికి పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకే ఇద్దరూ విపరీతంగా ఛాటింగ్ చేసేవారు. క్రమంగా అది అక్రమ సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే యశ్మ కుమార్ శ్వేతా రెడ్డికి చెందిన నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను సేకరించాడు. ఇక ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని, శ్వేత అంటే బాగా ఇష్టం పెరిగిపోయి యశ్మ కుమార్ పెళ్లి చేసుకుంటావా? లేదా అంటూ పట్టుబట్టాడు. ఆ వీడియోలు, ఫోటోలు మీ కుటుంబ సభ్యులకు పంపాలా? అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అలా చేయొద్దంటే పెళ్లి చేసుకోవాలని కోరాడు.
రోజు రోజుకూ యశ్మ కుమార్ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ఆమె అతని ఫోన్ లాక్కోవాలని భావించింది. ఫేస్ బుక్ ద్వారానే పరిచయమైన మరో స్నేహితుడు ఏపీలోని కృష్టా జిల్లా తిరువూరుకు చెందిన అశోక్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. ఫోన్ లాక్కోవాలంటే అతణ్ని హత్య చేయడం కరెక్టని భావించారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.
ఫేస్ బుక్ ఫ్రెండు కొంగల అశోక్‌కు పిలిపించి, ఈ నెల 4న యశ్మ కుమార్‌కు ఫోన్ చేసి ప్రశాంత్ హిల్స్‌కు రప్పించింది. కార్తీక్‌తో కలిసి అక్కడికి చేరిన పథకం అమలుకు సిద్ధమయ్యారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు చూశారు. సుత్తితో తలపై మోది ఫోన్ లాక్కున్నారు. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి కూపీ లాగడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. శ్వేతా రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.